ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
సాక్షి, విజయవాడ బ్యూరో: పొగాకు రైతుల్ని ఆదుకుంటామని, అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె గేట్‌వే హోటల్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు లేక రాష్ర్టంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని, పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాయని చెప్పారు. మృతి చెందిన మూడు రైతు కుటుంబాల్లో రెండు కుటుంబాలను పరామర్శించగలిగానని, పొగాకు బోర్డు ద్వారా వారికి కొంత పరిహారం ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల పరిహారంతోపాటు కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తానన్నారు.
అధికారికంగా 177మిలియన్ కిలోల పొగాకు సాగు జరిగితే ఈ నెల 15 నాటికి 148మిలియన్ కిలోలకుపైగా కొనుగోలు జరిగిందని, మరో 28.22మిలియన్ కిలోలు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని అదుకుంటామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.
పట్టిసీమకు నీరిచ్చాం... : గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామని, శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు పట్టిసీమ నీరు ఒక పంపు ద్వారా విడుదల చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని ఆదుకోవాలని సీఎం కేంద్రమంత్రికి విజ్జప్తి చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. నిర్ధిష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారంటూ మంత్రిని అడ్డుకున్నారు.