నేడు అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్ | Today, all courts Mega lokadalat | Sakshi
Sakshi News home page

నేడు అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్

Published Sat, Apr 12 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

Today, all courts Mega lokadalat

రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల కేసుల పరిష్కారం లక్ష్యం
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్
సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్

 
 హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 44 వేల కేసులను లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 6,670, క్రిమినల్ కేసులు 15,959, ప్రీలిటిగేషన్ (సివిల్, క్రిమినల్) కేసులు 22,413 ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నిర్వహించడం లేదని తెలిపారు. మన రాష్ట్రంలో ఎన్నికలు లేని నేపథ్యంలో మెగా లోక్‌అదాలత్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం అనుమతించారని చెప్పారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, జస్టిస్ రోహిణిల పర్యవేక్షణలో లోక్‌అదాలత్ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న 33 వేల కేసుల్లో ఇరువర్గాలకు ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల చైర్మన్ సహకారంతో అన్ని కోర్టుల్లో లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నామని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు వేల కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కందుకూరి అశోక్‌బాబు తెలిపారు. అలాగే జంట నగరాల పరిధిలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 2,500 కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని నాంపల్లి క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజిని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement