
మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు, చిత్రంలో బొత్స, అవంతి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కోటి రూపాయల నష్టం పరిహారాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదివారమే నష్ట పరిహారం అందించాలని చెప్పినప్పటికీ లీగల్ డాక్యుమెంట్లలో జాప్యం జరగడంతో సాధ్యం కాలేదన్నారు. మృతుల కుటుంబాలతో పాటు వెంటిలేటర్స్‌పై ఉన్న బాధితుల కుటుంబాలకు కూడా సోమవారం పరిహారం అందించనున్నామన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి రెండు రోజుల్లో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత గ్రామాల్లో ప్రజలు ఇంటికి చేరాక వివరాలు సేకరించి ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. ఘటనపై వేసిన కమిటీలు వంద శాతం సురక్షితం అని చెప్పిన తరువాతే ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించి, పలు చోట్ల ఏర్పాటు చేసిన 21 షెల్టర్లలో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇళ్లల్లోని సరకులు వినియోగించొద్దు
ఇళ్లల్లో వినియోగంలో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు వంటి నిత్యావసర సరకులను వినియోగించవద్దని మంత్రులు సూచించారు. ఫ్రీజ్‌లో ఉన్న వాటిని కూడా వాడవద్దన్నారు. ఇంటికి వెళ్లిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ప్రకటనల ద్వారా తెలియజేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని మంత్రులు కోరారు. కంపెనీలో గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదన్నారు. అక్కడి గాలి, నీరు, మట్టి ఎంత మేర కలుషితమైందనేది పరీక్షలు నిర్వహించామన్నారు. శనివారంతో పోల్చుకుంటే ఆదివారానికి కలుషిత గాలి తగ్గిందని తెలిపారు.
మాది ప్రచారాల ప్రభుత్వం కాదు
టీడీపీ సర్కారులా తమది ప్రచారాల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. ఓ సారి కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు.. కంపెనీని తరలించాలని అప్పుటి పెందుర్తి ఎమ్మెల్యే చంద్రబాబుకు లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నివేదిక ఆధారంగా కంపెనీపై చర్యలు
టీడీపీ డ్రామా కంపెనీ ప్రతినిధులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన స్క్రీప్ట్‌ను మీడియా ముందు చదివి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేశారని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రమాదం జరిగినా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యం ఉందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కంపెనీని తర లించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని తప్పకుండా రాబడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment