ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు గురువారం వెలువడనున్నాయి. ప్రధానమంత్రి ఆమోదించిన మార్గదర్శకాలను కేంద్ర వ్యక్తిగత శిక్షణ మంత్రిత్వ శాఖ గరువారం విడుదల చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్యోగుల తుది కేటాయిం పుల వరకు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా ‘ఆర్డర్ టు సర్వ్’ ఉత్తర్వులను కమలనాథన్ కమిటీ సవరించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞాపనలపై కమలనాథన్ కమిటీ గురువారం చర్చించనుంది. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, పీవీ రమేశ్, కేంద్ర వ్యక్తిగత శిక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనునున్నారు. ఇరు రాష్ట్రాలకు ఏ శాఖలో ఏ విభాగంలో ఏ కేడర్‌లో ఎన్ని పోస్టులుండాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని శాఖాధిపతుల్లో పోస్టుల సంఖ్య, ఎంత మంది ఉద్యోగులున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీలుగా ఉన్నాయనే వివరాలను ఆన్‌లైన్‌లో పంపేందుకు వీలుగా రాష్ట్ర పునర్విభజన విభాగం నాలుగు నమూనా పత్రాలను రూపొందించింది. కాగా, తొలి నమూనాపత్రం నింపేందుకు బుధవారంతో గడువు ముగి సింది. గురువారం నాటి సమావేశంలో ఆ నమూనా పత్రంలో వచ్చిన వివరాలపై కమలనాథన్ కమిటీ చర్చించనుంది. మిగతా రెండు, నాలుగు నమూనా పత్రాలు నింపేందుకు వచ్చే నెల 5 వరకూ గడువు ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా ప్రధాని ఆమోదం పొందిన ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు గురువారం వెలువడిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాలన్నింటిపైనా కమలనాథన్ కమిటీ చర్చించనుంది.
ప్రతీ నెల తొలి వారంలో అపెక్స్ కమిటీ భేటీ
విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్యా గల సమస్యల పరిష్కారంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతీ నెల తొలి వారంలో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 3న అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చిన్న చిన్న సమస్యలపై రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలకు అపెక్స్ కమిటీతో ఆమోద ముద్ర వేయించనున్నారు.
నేడు మార్గదర్శకాల విడుదల
Published Thu, Oct 30 2014 2:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement
Advertisement