ఒంగోలు, న్యూస్‌లైన్ : రెండో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. 9,42,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక మండలాలైన నాగులుప్పలపాడు, పొన్నలూరు, వలేటివారిపాలెం, గుడ్లూరు, టంగుటూరుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు జరుగుతున్నట్లు తొలిదశ ఎన్నికల్లో పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు.
అందులో భాగంగానే రెండో దశ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల ప్రభావం చట్ట సభలకు జరుగుతున్న ఎన్నికలపై స్పష్టంగా కనిపించబోతోంది. పల్లె ప్రజలే కదా.. అని పట్టీపట్టనట్లు వ్యవహరించిన పార్టీలకు సరైన గుణపాఠం చెప్పేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. స్థానిక పాలన ముగిసి మూడేళ్లు దాటినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల పల్లెల్లో ప్రగతి పడకేసిందని ఓటరు గుర్తించాడు.
ఎన్నికలు జరిగే ప్రాంతాలివే..
ఒంగోలు నియోజకవర్గంలోని రెండు మండలాలు, సంతనూతలపాడులో నాలుగు మండలాలు, కొండపిలో ఆరు మండలాలు, దర్శిలో ఐదు మండలాలు, కందుకూరులో ఐదు మండలాలు, కనిగిరిలో ఆరు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థులు
మొత్తం 374 ఎంపీటీసీ స్థానాలకుగాను 969 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 28 మండలాల జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది బరిలో ఉన్నారు. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కుదేలైపోయింది. చివరకు కనిగిరి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా తన నియోజకవర్గంలో అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమయ్యారంటే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగే ఆరు నియోజకవర్గాల్లోని 16 ఎంపీడీవో కార్యాలయాలు, 12 ఇతర కేంద్రాల నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేశారు.
కుదేలైన టీడీపీ
తొలి దశ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచిందని తెలియడంతో మలిదశ ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. వైఎస్సార్‌సీపీ నేతల్లో ఉత్సాహం నెలకొంటే టీడీపీ నేతలు కుదేలయ్యారు. ఆర్థికంగా సహకారం అందించేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పాటు కనీసం ప్రచారంలోనూ జనాన్ని ఆకట్టుకునేలా నాయకులు ముందుకు రాకపోవడం టీడీపీ వర్గాలను కలవరపరుస్తోంది. దీంతో ఏం చేయాలో తోచక చాలామంది పరువు కోసం ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపట్నం, పొన్నలూరు, కనిగిరి మండలాల్లో డబ్బు ఓటర్లకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు.
పక్కా ఓటైతే ముక్కు పుడకలు కూడా పంపిణీ చేశారు. అంతే కాదు.. చీరెలు కూడా అందజేసి ఆకట్టుకోవాలని భావించారు. అయితే ఈ వ్యవహారం బెడిసి కొట్టింది. ఒక్కో ఓటరుకు ఒక్కో రకంగా పంపిణీ కావడంతో జనంలో తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది. దీంతో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థులపై ఓటర్లలో వ్యతిరేకత వచ్చేసింది. అభివృద్ధే తమ మంత్రం..అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి జనం ఆకర్షితులవుతుండటం గమనార్హం. ఆల్‌ఫ్రీ కన్నా మడమ తిప్పని నాయకత్వమే మాకు ముఖ్యమని జనం భావిస్తుండడటంతో ఈ దశ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలింగ్ నేడు
Published Fri, Apr 11 2014 3:45 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement