అభివృద్ధి నివేదికలు రెడీ
నేడు ప్రీ బడ్జెట్ సదస్సు
సీఎం ముందుకు కీలక ప్రతిపాదనలు
మచిలీపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను బుధవారం విజయవాడ నగరంలో జరగనున్న ప్రీ బడ్జెట్ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రస్తావించేందుకు అధికారులు, మంత్రులు నివేదికలు సిద్ధం చేశారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ జె.మురళి, ట్రైనీ కలెక్టర్ సృజన నేతృత్వంలో ఈ నివేదికలను తయారుచేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ అం శాలు ఈ సదస్సులో చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు సమాచారం. మచి లీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రూ.760 కోట్లతో టెండర్లు పిలిచింది. వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ మధుకాన్ పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. భూ సేకరణ 80శాతానికి పైగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.
మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను రూ. 150 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలని మూడేళ్లుగా ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు. బెల్ కంపెనీ విస్తరణపై బుధవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి కొల్లు రవీంద్ర ‘సాక్షి’కి చెప్పారు.
కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 370 కిలోమీటర్ల మేర కోస్తా జాతీయ రహదారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. గతంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పనులు జరగడం లేదు. ఈ రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
కృష్ణా యూనివర్సిటీకి నూతన భవనాలను సమకూర్చేందుకు రూ.77 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ణయించారు. మొదటి విడతగా రూ. 7కోట్ల నిధులు విడుదలయ్యాయి. యూనివర్సిటీ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించేందుకు మంత్రులు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రా జాతీయ కళాశాలను అభివృద్ధి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.
మంగినపూడి బీచ్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదికలను అధికారులు సిద్ధం చేశారు.
బందరు పోర్టు పనులను అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రారంభిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభింపజేయాలని మంత్రులు, అధి కారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రైతు సాధికార సంస్థకు నిధుల కేటాయింపు, రుణమాఫీ, గన్నవరం ఎయిర్‌పోర్టుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తుళ్లూరులో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించిన అనంతరం విజయవాడలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను నివరించేందుకు నివేదికలు రూపొందించారు. డెల్టా ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనల మేరకు కాలువల ఆధునికీకరణ పైనా నివేదికలు తయారు చేశారు.అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కూచిపూడి గ్రామాన్ని, నాట్య మండలిని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసే అంశంపైనా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణానదిలో ఉన్న భవానీ ఐల్యాండ్ అభివృద్ధి చేసే అంశంపైనా ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిసింది.