హుజూర్‌నగర్ : తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో పర్యటించనున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలలో ఒకేరోజు 28 సెం.మీ. అత్యధిక వర్షపాతం మేళ్లచెరువు మండలంలో నమోదైంది. మండలవ్యాప్తంగా 17వేల ఎకరాలలో పత్తి, 2500 ఎకరాలలో మిర్చిపంట దెబ్బతింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు వర్షాలకు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ విజయమ్మ రైతులను పరామర్శించి వారిలో మనోధైర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేందుకు ఈ పర్యటనకు వస్తున్నారు.
ఖమ్మం జిల్లా పర్యటన నుంచి నేరుగా కోదాడ మీదుగా వయా రామాపురం క్రాస్‌రోడ్డు నుంచి నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం యతిరాజపురంతండాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. దొండపాడు వద్ద కూడా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి మేళ్లచెరువు మండల కేంద్రానికి చేరుకొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హుజూర్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు వెళతారు.