హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మేళ్లచెరువు మండలంలో పర్యటించనున్నారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను తాకిడికి నష్టపోయిన పంటలను పరిశీలించడంతో పాటు బాధిత రైతులను ఓదార్చేందుకు విజయమ్మ మేళ్లచెరువులో పర్యటిస్తున్నట్టు చెప్పారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి రైతులపై ప్రకృతి కన్నెర్రజేయడంతో కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. మేళ్లచెరువు మండలంలో అత్యధికంగా సాగు చేసిన పత్తి పంట వర్షాలకు దెబ్బతిని పోయిందన్నారు. ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ విజయమ్మ మేళ్లచెరువు మండలానికి చేరుకొని అక్కడ బాధిత రైతులతో మాట్లాడతారన్నారు.
అనంతరం వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలిస్తారని చెప్పారు. తర్వాత రైతులను ఉద్దేశించి ప్రసంగించి హైదరాబాద్‌కు చేరుకుంటారన్నారు. నియోజకవర్గానికి మొదటిసారిగా వస్తున్న వైఎస్ విజయమ్మకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, రైతుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, పోరెడ్డి నర్సిరెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, సాముల ఆదినారాయణరెడ్డి, పులిచర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపు విజయమ్మ రాక
Published Wed, Oct 30 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement