సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుప్పి గంతులు చూస్తుంటే నవ్వొస్తోంది. ఎవరి కార్యక్రమాలకైనా జనాన్ని రాకుండా అడ్డుకోగలిగినా, వారి గుండెల్లో ఉండే అభిమానాన్ని దూరం చేయగలుగుతారా’... ఇది ఓ కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్య. హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో గురువారం జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ నానా తిప్పలు పడుతున్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను, ఇతర వర్గాలప్రజలను రెచ్చగొడుతున్నారు. విజయమ్మను చూసేందుకు, కలిసేందుకు నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల నుంచి మేళ్లచెర్వుకు తరలివెళ్లేందుకు కార్యకర్తలు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, వీరెవరికీ వాహనాలు అద్దెకు ఇవ్వొద్దని ట్యాక్సీ ఓనర్లు, ఆటో యూనియన్ నాయకులను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి మరీ బెదిరించారు.
ఈ వ్యవహారాలను గమనించిన కాంగ్రెస్‌కే చెందిన ఓ నాయకుడు చేసిన పై వ్యాఖ్య నిజమేననిపిస్తోంది. హుజూర్‌నగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్.. విజయమ్మ పర్యటనను రాజకీయ కోణంలో చూస్తూ, వ్యక్తిగత ఎజెండాతోనే ఈ వ్యవహారమంతా నడుపుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో తన ఆధిపత్యానికి ఎవరైనా అడ్డుతగులుతున్నారని అనిపిస్తే వారిని ఏదో విధంగా భయపెట్టడం, లొంగదీసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడన్న విమర్శలూ లేకపోలేదు. కోదాడ ఎమ్మెల్యే, ఇతర అన్ని పార్టీల నాయకులు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఉత్తమ్ వేధింపులపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇపుడు హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వస్తున్న తమ నాయకురాలిని అడ్డుకోవాలని చూడడం ఆయన రాజకీయ ఎజెండాలో భాగమేనని వైఎస్సార్ సీపీ వర్గాలు దుయ్యబట్టాయి. ‘మంత్రి స్థాయిలో ఉండి, ఆయన మరీ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. చివరకు ట్రాక్టర్లు ఉన్న ఓనర్లూ బెదిరించారు. ఇదేం సంస్కృతి’.. అని గరిడేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్ నాయకులు వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో తనకు వైఎస్సార్ సీపీ నుంచి గట్టిపోటీ ఉంటుందన్న ఆందోళనతోనే ఇలా, పార్టీ ముఖ్యనాయకుల కార్యక్రమాలను అడ్డుకునేలా కుట్రలు పన్నుతున్నాడని, దా నికి తెలంగాణ అంటూ ముసుగు కప్పుతున్నాడని మరికొందరు పేర్కొన్నారు. అసలు తెలంగాణకు అనుకూలంగా ఏనాడూ మాట్లాడని మంత్రి, ఇపుడు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించగానే తెలంగాణ అంటూ ప్రేమ ఒలకబోస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన కావాలనే కొందరు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుకుని బలవంతంగా వారితో ప్రెస్‌మీట్లు పెట్టించి మాట్లాడించారని కూడా ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో పాతిక మందిదాకా సీమాంధ్ర మంత్రులతోనే నిత్యం పర్యటనలు పెట్టించిన మంత్రి ఉత్తమ్‌కు విజయమ్మను అడ్డుకోవాలని పిలుపునిచ్చే నైతిక హక్కు ఎక్కడిదని వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మొత్తానికి మంత్రి ఉత్తమ్ కేవలం తన వ్యక్తిగత ఎజెండాతో, లేనిపోని ప్రకటనలతో రెచ్చగొడుతూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారన్న విమర్శలు బాగా వ్యక్తమయ్యాయి.