తొలిపోరు ప్రశాంతం
- తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.52 శాతం నమోదు
- అక్కడక్కడా చెదురుమదురుసంఘటనలు, స్వల్పంగా లాఠీచార్జ్
- ఓటు వేసేందుకు ఉదయం నుంచి బారులుతీరిన జనం
- కిరణ్ స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని ఏకపక్షంగా పోలింగ్
- ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మదనపల్లె డివిజన్‌లో జరిగిన తొలివిడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 31 జెడ్పీటీసీ స్థానాలకు 445 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 80.52 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 10,85,763 మందికి గాను 8,78,339 మంది ఓటర్లు పోలింగ్‌కు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
అత్యధికంగా చిన్నగొట్టిగల్లు మండలంలో 89.12, అత్యల్పంగా పీలేరు మండలంలో 69.72 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపించలేదు. కుప్పంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగియడానికి కొద్దిసేపటికి ముందు కేంద్రానికి ఎక్కువ మంది ఓటర్లు చేరుకోవడంతో ఆలస్యంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. పనులకు వెళ్లే వారు కూడా ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. మహిళలకు కేటాయించిన క్యూలు భారీగా కనిపించాయి. ఉదయం ఏడు-తొమ్మిది గంటల మధ్య 15 శాతం నమోదు కాగా 9-11 గంటల మధ్య 36 శాతం, 11-01 గంటల మధ్య 55.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పోలింగ్ ముగిసే సమయానికి 80.52 శాతం నమోదైంది.
కుప్పం మండలం లక్ష్మీపురం, శాంతిపురం మండలం కడపల్లె పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. కుప్పం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని డీకేపల్లెలో ఆందోళన చేస్తున్న ఓటర్లను స్వల్పంగా లాఠీచార్జి చేసి అక్కడి నుంచి తరిమివేశారు. పీలేరు మండలం ముడుపులవేములలోనూ పోలీసులు లాఠీచార్జి చేశారు.
పలమనేరు మండలం మొరవ పోలింగ్ స్టేషన్‌లో బ్యాలెట్ పత్రాలపై ఓటర్లు వేసే స్వస్తిక్ గుర్తు ఇంకు ముద్దగా రావడంతో బ్యాలెట్ మడిచినప్పుడు ఇంకో అభ్యర్థి సింబ ల్‌పై కూడా ఆ గుర్తు పడుతుందని భావించిన అధికారులు కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. ఆ తరువాత కొనసాగించారు. మదనపల్లె మండలం పోతనపల్లె పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. పుంగనూరు మండలం బీముగారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వసతులు కల్పించలేదని ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పోలింగ్ కొనసాగింది.
కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ
కుప్పం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ కనిపించారు. కుప్పం- 1 ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోనూ సమాగుట్టపల్లె, అనుంగానిపల్లె, పెద్దబంగారునత్తం తదితర కేంద్రాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు, పోలింగ్ సిబ్బంది పట్టించుకోలేదు. ఓట్లు గల్లంతైన కారణంగా దళావాయినత్తపల్లె, చీమినాయునిపల్లె పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.
ఓట్లు టేబుల్ డ్రాలో వేసినా..
వి.కోట మండలం దానమయ్యగారిపల్లెపోలింగ్ కేంద్రంలో ఓటర్లు, ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను అక్కడి టేబుల్ డ్రాలో పడవేసి వెళ్లారు. ఇలాంటివి 16 బ్యాలెట్ పత్రాలు డ్రాలో కనిపించాయి. బ్యాలెట్ పత్రాలను బాక్సులో వేయాలన్న అవగాహన లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అంతమంది ఓటర్లు బ్యాలెట్ బాక్సులో వేయనప్పటికీ పోలింగ్‌సిబ్బంది గుర్తించలేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అధికారులను నిలదీయడంతో వారు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు పోలింగ్ నిలిపివేసి ఏజెంట్లకు నచ్చజెప్పి కొనసాగించారు. కాగా పలమనేరు నియోజకవర్గం పెదపంజాణి మండలంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అనుచరులు పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు.