ధరదడలాడించారు! | Tomato Farmers Fight For Reasonable Price | Sakshi
Sakshi News home page

ధరదడలాడించారు!

Published Mon, Apr 16 2018 8:45 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

Tomato Farmers Fight For Reasonable Price - Sakshi

టమాటా పంటను విక్రయించేది లేదంటున్న బెంకిలి, జింకిభద్ర గ్రామాల రైతులు

సోంపేట : సోంపేట మండలం బెంకిలి, జింకిభద్ర రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ ఇతరులు ధర నిర్ణయిస్తే పంట కోసి అప్పగించేవారు. కానీ గిట్టుబాటు ధర కోసం భీష్మించుకుని కూర్చుని దళారులనే తమ వద్దకు రప్పించుకున్నారు వీరు. ధర కోసం పంటను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి సాటి రైతుల్లో స్ఫూర్తి నింపారు. గిట్టుబాటు ధర అందజేస్తే గానీ పంట కోసేది లేదని, గ్రామానికి టమాటా కో సం ఎవరు వచ్చినా విక్రయించే ప్రసక్తే లేదని ఆదివారం భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో దళారులే ధర పెంచి రైతులను బుజ్జగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. సోంపేట మండలంలోని బెంకిలి, జింకిభద్ర గ్రామాల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో కాయగూరలు సాగు చేసి జీవనాధారం పొందుతుంటారు.

అయి తే ఈ సంవత్సరం రబీ సీజన్‌లో వేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట పొల్లాలో పాడైనా ఫర్వాలేదు గానీ గిట్టుబాటు ధర రాకపోతే విక్రయించేది లేదని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. చివరి వరకూ అలాగే ఉండి తమ పంతం నెగ్గించుకున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం  బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గత నాలుగేళ్ల రబీ సీజన్‌లో సుమారు 4 వందల ఎకరాల్లో టమాటా పంటను సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది పరిసర గ్రామాలైన పలాసపురం, లక్కవరం, బారువ, కంచిలి మండలంలోని కుత్తమ, మండపల్లి గ్రామాల్లో కూడా టమాటా సాగు చేశారు. సోంపేట, కంచిలి మండలాల పరిధిలో సుమారు 8 వందల ఎకరాల్లో టమాటా పంట రబీ సీజన్‌లో సాగు చేశారు. 

గిట్టుబాటు కాని ధర
కౌలుతో కలుపుకుని ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడులు వచ్చే సరికి మార్కెట్‌లో ధర లేకుండా పోయింది. దళారులంతా కుమ్మక్కై టమాటా కిలో రూ.2 రూ.3కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కూలీ ఖర్చు కూడా రాని పరిస్థితి ఎదురైంది. 30 కిలోల ట్రే రూ.70కు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో థర్మల్‌ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతులంతా ఏకమయ్యారు. గిట్టుబాటు ధర వస్తే గానీ పంట కోయబోమని దళారులకు తేల్చి చెప్పారు. దీంతో 30 కిలోల ట్రేను రూ.70కు కొంటామని వచ్చిన వారు రూ.130 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారిగా ధర రెట్టింపు చేయడం చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు.

అయినా ఇంకా ధర పెంచితే గానీ పంట కోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిన్నటి వర కు మార్కెట్‌లో లేని ధర ఇప్పుడు ఎలా వచ్చిందని దళారులను ప్రశ్నించారు. బయట మార్కెట్‌లో ధర పెరిగినా రైతులకు ఆ ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గ్రామానికి చెందిన రైతులు ఎం.బుద్దేశ్వరరావు, ఎం.లోకనాథం, కె.భీమయ్య, పి.సురేష్, టి. బాబూరావు, కె.రామారావు, పి.దుర్యోధన తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతుకు మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రావని వారు పేర్కొన్నారు. దళారులు ధర పెంచక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దళారులు దిగి రావడంతో పంట పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలి
ప్రభుత్వాలు కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే పంట దాచుకునే వీలుంటుంది. కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడంతో పంట నిల్వ ఉండే అవకాశం లేకపోయింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంట ఇవ్వాల్సి వచ్చేది. 
– మడ్డు బుద్దేశ్వరరావు బెంకిలి, రైతు

గిట్టుబాటు ధర రావడం లేదు
టమాటాను కష్టపడి సాగు చేస్తుంటే గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్‌లో ధర ఉన్నా రైతులకు మాత్రం దళారులు గిట్టుబాటు ధర ఇవ్వ డం లేదు. దీంతో పంట పాడైనా ఫర్వాలేదు గానీ కోయకూడదని తీర్మానించాం.
– కె.భీమయ్య, బెంకిలి టమాటా రైతు 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement