
రేపు తిరుపతిలో వైఎస్‌ఆర్ జనభేరి
తిరుపతి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మార్చి ఒకటిన తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో ఏర్పాటు..
- స్వాగత సన్నాహాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- లక్ష్మీపురం సర్కిల్ నుంచి తిరుపతి నగరంలో రోడ్‌షో
- ఏర్పాట్లపై సమీక్షించిన వైవీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన
- నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు
- లీలామహల్ సర్కిల్లో సభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మార్చి ఒకటిన తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసే ‘వైఎస్‌ఆర్ జనభేరి’ కి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఆ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో జననేత రోడ్‌షో నిర్వహిస్తారు. నగరంలో రెండు కుటుంబాలను ఓదారుస్తారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రోడ్‌షో ప్రారంభమవుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ని యోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలు రెండు రోజుల నుంచి జననేత పర్యటనను జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ.సుబ్బారెడ్డి సమీక్షించారు. వైఎస్.జగన్ మార్చి 1వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి నగరంలోని ప్రధానమార్గాల మీదుగా రోడ్‌షో నిర్వహిస్తారు. వైఎస్ మరణానంతరం మృతి చెందిన అభిమానుల కుటుంబాలను మధ్యాహ్నం ఓదారుస్తా రు. సాయంత్రం లీలామహల్ సర్కిల్‌లో నిర్వహించే వైఎస్‌ఆర్ జనభేరి సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమలలో బస చేసి, మార్చి 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు.
ఏర్పాట్లు సమీక్షించిన ఎమ్మెల్యే భూమన
తిరుపతిలో నిర్వహించనున్న వైఎస్‌ఆర్ జనభేరి ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సమీక్షించారు. ఇప్పటి వరకు నగరంలో జననేతకు స్వాగతం పలికేందుకు ఎక్కడెక్కడ సన్నాహాలు చేస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. నగరంలో రోడ్‌షో నిర్వహించాల్సిన మార్గాలను ఖరారు చేశారు. జనభేరి ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే జగనన్న సీఎం కావాలని అందుకోసం రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు గట్టిగా పని చేయాలని అన్నారు. శనివారం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే వైఎస్‌ఆర్ జనభేరి సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు
తిరుపతి నగరంలో నిర్వహించే వైఎస్‌ఆర్ జనభేరికి హాజరయ్యే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ వార్డు వార్డునా ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలో జగన్ రోడ్‌షో నిర్వహించే అన్ని మార్గాలతో పాటు, ప్రధాన కూడళ్లలో అభిమాన నాయకుడికి ఘనస్వాగతం అంటూ రాసిన ఫ్లెక్సీలు, ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి జగనన్నను సీఎం చేయండి, భూమన కరుణాకరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచే అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాట్లు మొదలయ్యాయి.
లీలామహల్ సర్కిల్‌లో వేదిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ కూడలి, డీఆర్.మహల్ సర్కిల్, గ్రూప్ థియేటర్స్, బండ్లవీధి, గాంధీరోడ్డు, క్రిష్ణాపురం ఠాణా, జ్యోతిథియేటర్ సర్కిల్, భవానీనగర్ జంక్షన్, మున్సిపల్ ఆఫీసు కూడలి ఇలా దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో జననేత వైఎస్.జగన్‌కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రతి కూడలిలోనూ పెద్ద ఎత్తున మహిళలు, యువకులు స్వాగతం పలికేందుకు ఆయా వార్డుల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వైవీ సుబ్బారెడ్డి పరిశీలన
వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు గురువారం రాత్రి తిరుపతికి పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ. సుబ్బారెడ్డి వచ్చారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా జనభేరి జరిగే ప్రాంతమైన లీలామహల్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ సభాస్థలిని పరిశీలించారు. అనంతరం పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్‌లో ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అ ధ్యక్షులు కే.నారాయణస్వామి, రాజం పేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఆదిమూలం, తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నెల్లూరు జి ల్లాకు చెందిన నాయకులు సంజీవయ్య, సునీల్, పార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.