అనంతగిరి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన సినిమాలను ఈ ప్రాంతంలో ప్రదర్శించరాదంటూ తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రాంచరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రదర్శనలను పలుచోట్ల అడ్డుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని సినిమాక్స్, శైలజ థియేటర్లలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మార్నింగ్ షో ప్రారం భం కాగానే తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ తదితరులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సినిమాక్స్ థియేటర్‌లోకి దూసుకుపోయారు.
తెరకు అడ్డుగా నిలవడంతో సినిమా ప్రదర్శన ప్రారంభం కాలేదు. తెలంగాణవాదులు థియేటర్‌లోనే ఆందోళన కొనసాగిస్తుండడంతో ప్రేక్షకులంతా బయటకు వచ్చారు. తెలంగాణవాదులు థియేటర్ మేనేజర్‌తో మాట్లాడి ప్రేక్షకులందరికీ డబ్బులు తిరిగి ఇప్పించారు. అదేవిధంగా శైలజ థియేటర్‌లోకి కూడా తెలంగాణవాదులు దూసుకుపోయి ప్రదర్శనను అడ్డుకున్నారు. అనంతరం థియేటర్ బయటకు వచ్చి వాల్‌పోస్టర్‌ను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేయాలని, లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న చిరంజీవి వ్యాఖ్యలకు నిరసనగా సినిమా ప్రదర్శనలను అడ్డుకున్నట్టు స్పష్టం చేశారు.
శంషాబాద్‌లో..
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తున్న చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతామని టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ, ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. రాంచరణ్ తేజ ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనను స్థానిక గణేష్ 70ఎంఎం, శ్రీలక్ష్మీ టాకీస్‌లలో అడ్డుకున్నారు. సినిమా టికెట్లు ఇవ్వకుండా నిలిపివేశారు. తెలంగాణను అడ్డుకోడానికి కేంద్ర మంత్రి చిరంజీవి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్, నాయకులు రాజేందర్, ఆనంద్, జేఏసీ, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
పరిగిలో..
రాంచరణ్ నటించిన తుఫాన్ సినిమాకు తెలంగాణ సెగ తగిలింది. పరిగిలో చిత్రం ప్రదర్శిస్తున్న సాయికృష్ణ, శారద థియేటర్ల వద్దకు టీఆర్‌ఎస్‌వీ నాయకులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. సినిమా పోస్టర్లను చించివేయడంతో పాటు శారద థియేటర్ ఎదుట పోస్టర్లను తగులబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి కొమ్ముకాస్తున్న చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను ప్రదర్శించబోనివ్వమని నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ నాయకులు సతీష్, క్లెమెంట్, పృథ్వీ, రాజశేఖర్, తేజకిరణ్, ఎం.నగేష్, పి.తేజ, కె.రాజు, నరేష్, రాకేష్‌రెడ్డి, రాధాకృష్ణ, ప్రవీణ్, అఖిల్ పాల్గొన్నారు. అనంతరం పోలీసులు సినిమా థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి చిత్ర ప్రదర్శన కొనసాగేలా చూశారు.
‘తుఫాన్’కు తెలంగాణ సెగ
Published Sat, Sep 7 2013 5:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement