కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్:
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాకు శుక్రవారం ఉద్యమ సెగ తగిలింది. పోలీసు రక్షణలో సినిమా ప్రదర్శించాలనుకున్న థియేటర్ యజమానుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కర్నూలులో సమైక్యవాదులు ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ సినిమా తుఫాన్ జిల్లాలోని నంద్యాల, డోన్, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లో విడుదల చేస్తున్నట్లు యజమానులు ముందుగా ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల వరకు తుఫాన్ సినిమాను కర్నూలులో ప్రదర్శించడం లేదంటూ చెప్పిన యజమానులు తెల్లారే లోపే.. ఆనంద్, శ్రీరామ, రాజ్, వెంకటేష్(మినీప్లెక్స్) థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు వాల్ పోస్టర్లు వెలిశాయి.
శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య థియేటర్లకు చేరుకున్న అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. పోస్టర్ల వద్ద కోర్టు ఆదేశాల మేరకు సినిమాను అడ్డుకుంటే చర్యలు తప్పవన్న గోడ పత్రికలు వెలిశాయి. సినిమా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం రావడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కమిటీ, వివిధ సంఘాల నాయకులు సినిమా ప్రదర్శిస్తున్న ఆనంద్ థియేటర్‌కు ర్యాలీగా బయల్దేరారు. పోస్టర్లను చింపి వేసి థియేటర్‌పై దాడికి దిగారు. పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. క్యాంటిన్‌లోని వస్తువులను చిందరవందర చేసి ప్లాస్టిక్ వస్తువులను ధ్వంసం చేశారు. రసాభాసగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పే యత్నాలు చేశారు. ససేమిరా అన్న సమైక్యవాదులు సినిమా ప్రదర్శనను ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకూడదని వాగ్వాదానికి దిగారు. ఎంతకూ సద్దుమణగకపోవడంతో థియేటర్ నిర్వాహకులతో మాట్లాడిన పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా బంగారు పేట సమీపంలోని శ్రీరామ థియేటర్‌లో సినమా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం మేరకు సమైక్యవాదులు అక్కడికి చేరుకున్నారు. నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ థియేటర్‌లోని పోస్టర్లను చింపివేశారు. అప్పటికే 700 టిక్కెట్లను బుకింగ్‌లో ఇచ్చిన థియేటర్ నిర్వాహకులు టిక్కెట్టు డబ్బులను ప్రేక్షకులకు తిరిగి ఇచ్చారు. అదే విధంగా రాజ్, వెంకటేష్(మినీప్లెక్స్), థియేటర్లలోను ప్రదర్శనలు నిలిపివేశారు.
‘తుఫాన్’కు ఉద్యమ సెగ
Published Sat, Sep 7 2013 2:29 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement