సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్‌లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.
ఇద్దరు యువ దర్శకులతో...
నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
సంక్రాంతి తర్వాత...
ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది.
పెద్ది
‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
డీజే టిల్లు దర్శకుడితో...
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్‌లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.
కథ విన్నారా?
‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్‌మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది.
మైల్‌స్టోన్ ఫిల్మ్
కెరీర్‌లో మైల్‌స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment