మెగా వర్సెస్‌ అల్లు.. అసలేం జరుగుతుంది? | Social Media War Between Allu Family And Mega Family | Sakshi
Sakshi News home page

మెగా వర్సెస్‌ అల్లు.. అసలేం జరుగుతుంది?

Published Wed, Feb 12 2025 4:56 PM | Last Updated on Wed, Feb 12 2025 6:02 PM

Social Media War Between Allu Family And Mega Family

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇరు కుటుంబాల నుంచి స్టార్స్‌ ఉన్నారు. అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే అనే భావన అందరిలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది. దానికి కారణం సోషల్‌ మీడియా అనే చెప్పాలి. మొన్నటి వరకు ట్విటర్‌, ఇన్‌స్టా గ్రామ్‌లో అల్లు అర్జున్‌(Allu Arjun)ని ఫాలో అయినా మెగా హీరోలు.. ఇప్పుడు వరుసగా అన్‌ ఫాలో అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో మెగా మేనల్లుడు సాయి దుర్గాతేజ్‌ బన్నీని అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్స్‌, అల్లు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు. ఒకరినొకరు ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు.

(చదవండి: మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్)

ఇక పుష్ప 2 రిలీజ్‌ సమయంలో మెగా హీరోలెవరూ ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఏ చిన్న సినిమా విజయం సాధించినా మాట్లాడే చిరంజీవి.. పుష్ప 2 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బద్దలు కొట్టినా.. స్పందించలేదు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శిస్తే.. పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ మాత్రం తమకు తెలియదన్నట్లుగానే ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ అయితే ‘సంధ్య థియేటర్‌’ ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే అరెస్ట్‌ తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రామ్‌ చరణ్‌(Ram Charan) ఇన్‌స్టాలో బన్నీని అన్‌ ఫాలో చేయడంతో అలు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి.

బన్నీ మాత్రమే..
రామ్‌ చరణ్‌- బన్నీల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వరుసకు బావ బామ్మర్దులు అయినా..అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్లు. చరణ్‌ కంటే ముందే బన్నీ సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి ఇన్‌స్టాలో 28.5 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహరెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. రామ్‌ చరణ్‌ కాస్త ఆలస్యంగా ఇన్‌స్టాలోకి వచ్చినా..26 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన 38 మందిని ఫాలో అవుతున్నాడు. 

(చదవండి: 'ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలా?'.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన శ్యామల)

మొన్నటి వరకు ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్‌ కూడా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా అన్‌ ఫాలో చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ ను చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆయన తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల  మాత్రం బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చరణ్‌ - బన్నీ మధ్యే ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

చరణ్‌ స్పందించేనా?
ఈ మధ్య సోషల్‌ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్‌ మధ్య పెద్ద యుద్దం నడుస్తోంది. మెగా హీరోలు ఏం మాట్లాడినా.. దానికి అల్లు ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే.. కావాలనే హేళన చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌ గేమ్‌ ఛేంజర్‌ నిర్మాత దిల్‌ రాజుపై అల్లు అరవింద్‌ సరదాగా పంచులేస్తే.. దాన్ని రామ్‌ చరణ్‌కి ఆపాదించి..అరవింద్‌ని ట్రోల్‌ చేశారు. అది భరించలేక చివరకు అరవింద్‌ వివరణ ఇచ్చాడు. తన మేనల్లుడు చరణ్‌తో మంచి రిలేషన్‌ ఉందని చెప్పాడు. ఇది చెప్పి వారం రోజులు కూడా దాటకముందే బన్నీని చరణ్‌ అన్‌ఫాలో చేయడం గమనార్హం. మరి ఇది పొరపాటున జరిగిందా లేదా కావాలనే అన్‌ ఫాలో చేశాడా అనేది తెలియాలి. ఒకవేళ దీనిపై చరణ్‌ స్పందించపోతే..ఇద్దరి ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ సోషల్‌ మీడియా వార్‌ జరుగడం ఖాయం. ఈ ‘అన్‌ ఫాలో’ గొడవకి ఫుల్‌ స్టాప్‌ ఎవరు పెడతారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement