‘మేటి’ కొప్పాక చక్కెర
- రూ.73.55 లక్షలతో సెంట్రీ ఫ్యూగల్ ఏర్పాటు
- 50 నిమిషాల్లో 1750 కిలోల పంచదార ఉత్పత్తి
- ప్యాకింగ్‌లోనూ ఆధునిక పరిజ్ఞానం
- నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం
ఏటికొప్పాక చక్కెర కర్మాగారం ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నాణ్యమైన పంచదార ఉత్పత్తికి అవసరమైన మెషినరీని అంచెలంచెలుగా యాజమాన్యం సమకూరుస్తోంది. ప్యాకింగ్‌లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు. పంచదార దిగుబడిలో నాణ్యత పెంచడంతోపాటు ప్యాకింగ్ వేగవంతానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు.
యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇప్పటివరకు మూడు రకాల పంచదార ఉత్పత్తి అయ్యేది. పాత యంత్రాలతో తయారీతో ఇందులో 20 శాతమే నాణ్యమైనది. మిగిలిన రెండు రకాల్లో నాణ్యత కొరవడి ఫ్యాక్టరీ ఆదాయంపై ప్రభావం కనబడేది. యాజమాన్యం ఆర్థికంగా ఒడిదుకులకు గురయ్యేది. ఇలా మూడు రకాల పంచదార ఉత్పత్తితో ఆదాయం తగ్గడమే కాకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరమయ్యేవారు.
ఇప్పుడు రూ.73.55 లక్షలతో సెంట్రీఫ్యూగల్ అనే యంత్రాన్ని కర్మాగారంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా 50 నిమిషాల్లో 1750 కిలోల నాణ్యమైన ఒకేరకం పంచదార ఉత్పత్తి అవుతోంది. అధిక శాతం నాణ్యత ఉన్న (క్రిస్టల్)ఉండడంతో ఫ్యాక్టరీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. సెంట్రీఫ్లీగల్‌తో ఎటువంటి వృథా లేకుండా ఉత్పత్తి జరుగుతోంది.
వృథాకాకుండా క్రమపద్ధతిలో ఉండేందుకు రూ.50 లక్షలతో బిన్ అనే మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచదారను గోనె సంచిలో పట్టడం దగ్గర నుంచి బస్తాలను కుట్టడం వరకు అత్యంగా వేగంగా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరికరం ఏర్పాటుతో 15 మంది కార్మికులకు బదులు ఒకరిద్దరు సరిపోతున్నారు. ఇది గంటకు 207 బస్తాల పంచదారను నిల్వ చేస్తోంది. ప్యాకింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.