జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. కలకడ మండల పరిధిలోని నడిమిచర్ల, కోన, గుడిబండ గ్రామాల్లో నాలుగు నివాస గృహాలు కూలిపోయాయి.
సాక్షి, తిరుపతి: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. కలకడ మండల పరిధిలోని నడిమిచర్ల, కోన, గుడిబండ గ్రామాల్లో నాలుగు నివాస గృహాలు కూలిపోయాయి. 26 మేకలు, గొర్రెలు, రెండు పాడి ఆవులు, రెండు దూడ లు మృత్యువాత పడ్డాయి. అడవిలో రెడ్డికుంట చెరువు తెగిపోయింది. వడ్డికుంట, దేవళంమాను చెరువు, గుట్టచెరువు, నల్లగుట్టకుంట, కొత్తచెరువులు తెగిపోవడంతో సుమారు 350 ఎకరాల్లో వేరుశెనగ, టమాట, వరి పంట లు నీట మునిగాయి. గుర్రంకొండ మండలం నడింకండ్రిగ గ్రామ పరిధిలో మూడు కుంటలు, నాలుగు చెక్‌డ్యాంలు తెగిపోయాయి. గొర్రెలు, మేకలు మృతి చెందాయి.
ప్రవహించిన ఆలేరు వాగు
బి.కొత్తకోట మండల పరిధిలో మంగళవారం రాత్రి 10.30 నుంచి ఉదయం 3.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఆలేరు వాగు ప్రవహించింది. 20 ఏళ్ల తర్వాత వాగు ప్రవహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో రాత్రి నుంచి ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. పలమనేరులో పట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. టమాట పంట దెబ్బతింది. చంద్రగిరి పరిధిలోనూ భారీ వర్షం కురిసింది. శేషాచలం కొండల్లో నుంచి భారీగా వరద నీరు రావడం తో కల్లేటి వాగు ప్రవహించింది.
పుత్తూరు, నగరి పరిధి లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలోకి నీరు చేరింది. నగరి పరిధిలోని మాంగాడు, గుం డ్రాజుకుప్పం, నగరి చెరువులకు నీరు చేరింది. మాం గాడు చెరువు కలుజు పారుతోంది. పుంగనూరులో కురి సిన భారీ వర్షానికి చిన్న చిన్న కుంటలన్నీ పొంగి ప్రవహించాయి. పూతలపట్టు పరిధిలోనూ భారీ వర్షం కురి సింది.
కుంటలు, కాలువల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల కింద వేరుశెనగ, వరి, మామిడి, అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కుప్పం పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. వేరుశెనగ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడమటి మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతినే అవకాశముం దని వ్యవసాయాధికారులు వెల్లడించారు.