ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌కు వచ్చే పర్యాటకల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. సాగర్ ప్రాజెక్టుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు
పర్యాటకుల భద్రత డొల్ల
Published Thu, Sep 19 2013 1:45 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
నాగార్జున సాగర్, న్యూస్‌లైన్ :ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌కు వచ్చే పర్యాటకల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. సాగర్ ప్రాజెక్టుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే నిఘా సంస్థల హెచ్చరికల మేరకు ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు భద్రతను కట్టుదిట్టం చేసింది. కానీ, పర్యాటకుల భద్రతను మాత్రం గాలికి వదిలేసింది. కేవలం రోడ్డుమార్గాల్లో మాత్రమే నిఘా ఏర్పాటు చేసిన ప్రభుత్వం జలమార్గాలను వదిలేసింది. దీంతో నాగార్జున సాగర్‌లో బోటింగ్ చేసేందుకు, నాగార్జున కొండను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భద్రత కరువైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నాగార్జుకొండను తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
లాంచీస్టేషన్‌లో ..
నాగార్జునసాగర్‌లో ఉన్న లాంచీస్టేషన్ వద్ద ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోలేదు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ వద్ద బాంబు పేలుళ్ల తర్వాత కూడా ఇక్కడ భద్రతా చర్యలు లేవు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల భద్రత విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రవాదులు పర్యాటకుల రూపంలో వచ్చి నాగార్జునసాగర్‌లో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందిం చకపోవడం దారుణమని స్థానికులు పేర్కొం టున్నారు. లాంచీ స్టేషన్‌కు వచ్చే పర్యాటకులను తనిఖీ చేయడంతో పాటు ఉగ్రనీడపై డేగకన్ను పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా నేటికీ కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. లాంచీలను కూడా బాంబుస్క్వాడ్ బృందం తనిఖీ చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా తీవ్ర వాదులు లాంచీల్లో బాంబులు పెడితే పరిస్థితి ఏమిటనేది ఎవరూ ఊహించలేనిది. పర్యాటకుల రక్షణకు ప్రభుత్వం లాంచీస్టేషన్‌లో సాయుధ సిబ్బందిని నియమించడంతో పాటు లాంచీలో కొండపైకి వెళ్లే పర్యాటకులను మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేయడం, స్పీడ్ బోట్లతో వాటికి రక్షణ ఏర్పాటు చేయడం, నైట్ విజన్ గ్లాసులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవరం ఉంది.
డ్యాంపైనా అరకొర సిబ్బందే...
సాగర్ డ్యాం రక్షణపై కూడా ప్రభుత్వం అంతగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాగర్ డ్యాం రక్షణకు 150 మంది ఎస్‌పీఎఫ్ సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం 70మందితోనే అరకొర రక్షణ కల్పిస్తున్నారు. దీంతో పాటు భద్రతా దళాలకు అత్యాధునికమైన ఆయుధాలతో పాటు, మెటల్ డిటెక్టర్లు, సెర్చ్‌లైట్లు, అధిక వెలుతురునిచ్చే మెర్క్యూరీ, డ్యూ లైట్స్‌లు, నది గుండా వచ్చే తీవ్రవాదుల ముప్పును ఎదుర్కొనేందుకు స్పీడ్ బోట్లు, సీసీ కెమెరాలు, నిఘా పరికరాలు అవసరం. కానీ వాటిని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement