పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకువెళ్తున్న టూరిజం బోటు
పశ్చిమగోదావరి, పోలవరం : గోదావరి విహారం గాడి తప్పుతోంది. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లో, సమాచార లోపంతోనో ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారులు, టూరిజం బోట్ల నిర్వాహకుల మధ్య సమావేశం జరిగే వరకు బోట్లను నిలిపివేయాలని ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తే, మరో ఉన్నతాధికారి నిరభ్యంతరంగా నడుపుకోవచ్చని అనుమతిచ్చారు. దీంతో ఆదివారం ఎనిమిది టూరిజం బోట్లు పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకుని వెళ్లాయి. ఇటీవల రాయల గోదావరి టూరిజం బోటులో అగ్ని ప్రమాదం జరిగి బోటు పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. బోటు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో వందమందికి పైగా ప్రాణాపాయం తప్పింది.
ఈ ప్రమాదం నేపధ్యంలో పోలీస్, రెవెన్యూ, నీటి పారుదల, అగ్నిమాపక, మత్స్య శాఖల అధికారులతోను, టూరిజం బోట్ల నిర్వాహకులతోనూ సమావేశం నిర్వహించి, అనుమతులపైనా, జాగ్రత్తలపైనా చర్చించాక అనుమతి ఇవ్వాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ నిర్ణయించినట్టు సమాచారం. అయితే టూరిజం బోట్ల యజమానులు శనివారం రంపచోడవరం సబ్–కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన బోట్లను నడుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. అనుమతితో పాటు సోమవారం నుంచి సంబంధిత శాఖల అధికారులు టూరిజం బోట్లను తనిఖీ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
అయితే అగ్ని ప్రమాదం జరిగి బోటు కాలిపోయినా బోట్ల అనుమతులపైనా, పర్యాటకుల రక్షణ చర్యలపైనా ఏవిధమైన చర్యలు చేపట్టకుండా టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వటం చర్చనీయంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు మాత్రమే టూరిజం బోట్లకు అనుమతి ఉంది. అనుమతులను ఇరిగేషన్ శాఖ బోట్ సూపరింటెండెంట్ ఇచ్చేవారు. ఇటీవల కొత్త నిబంధనల ప్రకారం కాకినాడ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా మే నెలాఖరు వరకు బోట్లను తిప్పుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖకు చెందిన బోట్ సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్‌ను ప్రశ్నించగా సోమవారం సమావేశం నిర్వహిస్తామని, రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment