సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా ఏజెన్సీలో బంద్
Published Thu, Oct 17 2013 3:25 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
రంపచోడవరం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం ఏజెన్సీలోని ఏడు మండలాల్లో ప్రధాన రహదారుల అష్టదిగ్బంధం జరిగింది. డివిజన్ కేంద్రం రంపచోడవరం సహా అన్ని మండల కేంద్రాల్లో దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) ఆధ్వర్యంలో బుధవారం ఏజెన్సీ అష్టదిగ్భంధం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాజవొమ్మంగి మండల కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలోని విశాఖ జిల్లా సరిహద్దు రోడ్డులో గిరిజనులతో కలిసి ఆయన బైఠాయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాస్తారోకో కొనసాగింది.
అనంతరం అడ్డతీగల మండలం గొంటువాని పాలెంలో వంటావార్పు, రహదారి దిగ్భంధం జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రిపాపారాయుడు రోడ్డు దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీ ముఖద్వారాలైన ఫోక్సుపేట, గొంటువానిపాలెం. నెల్లిపూడి, రాజవొమ్మంగి వద్ద రహదారులు దిగ్బంధం చేయడంతో ఏజెన్సీకి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. దాదాపు పది గంటలు పాటు దిగ్భంధం కార్యక్రమం జరిగింది. రంపచోడవరం మండలం ఫోక్సుపేట వద్ద రాజమండ్రి-భద్రాచలం రహదారిని దిగ్భంధించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
దేవీపట్నం ఎస్సై ప్రశాంత్‌కుమార్ పోలీస్ సిబ్బందితో అక్కడకు వెళ్లి రాస్తారోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, సర్పంచ్‌లు ఉన్నారు. మధ్యాహ్నం వ్యక్తిగత పూచీకత్తులపై వారిని విడిచిపెట్టారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో ఫజుల్లాబాద్ వద్ద అనంత ఉదయభాస్కర్ అష్టదిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు.
Advertisement