కష్టాలను ఓర్చుకుంటూ 66 రోజుల పాటు ఉద్యమం | Orcukuntu 66 days, along with the difficulty in movement | Sakshi
Sakshi News home page

కష్టాలను ఓర్చుకుంటూ 66 రోజుల పాటు ఉద్యమం

Published Fri, Oct 18 2013 6:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Orcukuntu 66 days, along with the difficulty in movement

సాక్షి, రాజమండ్రి: యూపీఏ ప్రభుత్వం తెలుగురాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు నిర్ణయించడంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు గురువారం తమ సుదీర్ఘ సమ్మెను విరమించారు. ముందు వ్యాపారులు, వివిధ సామాజిక సేవా సంఘాలు, న్యాయవాదులు నిరసన గళం వినిపించగా, ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీఎన్‌జీఓలు సీమాంధ్ర జిల్లాల్లో నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో సమైక్య సెగ రాష్ట్ర ప్రభుత్వానికి తాకింది. అక్కడి నుంచి ఉద్యోగులు తమ తడాఖాను కేంద్రానికి కూడా చవి చూపించారు. ఉద్యోగుల ప్రవేశం నుంచి ప్రారంభమైన సిసలైన సమైక్య ఉద్యమానికి అన్నివర్గాలు స్వచ్ఛందంగా తోడై ముందుకు నడిపించారు. గురువారం నాటికి పూర్తయిన 79 రోజుల మహోద్యమంలో ఉద్యోగులు 66 రోజులు భాగస్వాములుగా నిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కిరి చేశారు. కాగా ఎటువంటి హమీ లభించకుండానే అర్ధంతరంగా సమ్మె ముగిసిపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 
 
 ఉద్యమం సాగిందిలా..
 జూలై 30న తెలంగాణ  ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో 31వ తేదీన జిల్లాలో ఉద్యమం రాజుకుంది. ముందు తెలిసినా సరే అధిష్టానానికి విధేయులుగా విభజనకు మార్గం సుగమం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు. ప్రతిపక్షంగా ఉండీ అడ్డుకోలేని టీడీపీ నేతలు ప్రజలకు ముఖాలు చాటేశారు. కులవృత్తుల సంఘాలు, వ్యాపారులు, న్యాయవాదులు, వివిధ రంగాల కార్మికులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగ వర్గాలు నిరసన బాట పట్టాయి. తమ ప్రతినిధుల చిత్రాలను చెప్పులతో కొట్టారు. గాడిదలకు, కుక్కలకు మంత్రులు, ఎంపీల చిత్రాలు కట్టి ఊరేగించారు. లెక్కిస్తే గిన్నిస్‌రికార్డు కూడా ఎక్కవచ్చేమోననిపించేలా దేశంలోనే ఏ ఉద్యమంలోనూ దగ్ధం చేయనన్ని దిష్టిబొమ్మలను సమైక్య ఉద్యమంలో దగ్ధం చేశారు. హైదరాబాద్ మనది కాకపోతే ఉపాధి ఎలా అని ఆందోళన చెందుతూ విద్యావంతులైన యువకులు, తమ భవిష్యత్తు ఏమిటనే బెంగతో విద్యార్థులు రాష్ట్ర విభజనపై గర్జించారు. వాడవాడలా సభలు, సమావేశాలు పెట్టారు. విరాళాలు వేసుకుని మరీ కార్యక్రమాలు కొనసాగించారు.
 
 పలు రకాలుగా నిరసనలు
 ఉద్యమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిరాహార దీక్షలు కొనసాగాయి. సమైక్యవాదులు జలదీక్షలు చేశారు. తల్లకిందులుగా నిలబడ్డారు. గల్లీ నుంచి ఢిల్లీకి వినిపించేలా జనగళ ఘోష నిర్వహించారు. భారీ ర్యాలీలు చేశారు. తెలుగుజాతి సమైక్యతను చాటేలా బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. నేతల వైఖరులను కార్టూన్ల ద్వారా ఎండగట్టారు. చిత్రకారులు భావవంతమైన బొమ్మలు గీశారు. రాయవరంలో గ్రామస్తులు స్వచ్ఛంద గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇలా కొత్త పుంతలు తొక్కిస్తూ పూర్తి గాంధేయవాదంతో ఉద్యమాన్ని కొనసాగించారు. ఎంపీలు జిల్లాకు వచ్చేందుకు భయపడే స్థితి సృష్టించారు. రాష్ట్రమంత్రులు రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
 
 ఉద్యమ ప్రస్థానం ఇలా...
 జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఉద్య మం ప్రారంభమైంది. సుమారు 45వేల మంది పర్మినెంట్, మరో 19 వేల కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. రెవిన్యూ, మున్సిపల్ ఉద్యోగులు ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. సెప్టెంబర్ 13 నుంచి విద్యుత్ ఉద్యోగులు 72 గంటలు సమ్మెలోకి వెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. కేంద్ర కేబినెట్ కమిటీ టీనోట్‌ను ఆమోదించడంతో ఆగ్రహించిన విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ మూడున నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. మర్నాడు మరోసారి ఈపీడీసీఎల్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ చర్యతో నాలుగు రాష్ట్రాల్లో చీకట్లు అలుముకున్నాయి.
 
 కేంద్రం కూడా ఆలోచనలో పడిన తరుణంతో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమణ బాట పట్టాయి. ముందుగా విద్యుత్తు ఉద్యోగులు, ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తాజాగా గురువారం ఉదయం గెజిటెడ్ ఉద్యోగులు, సాయంత్రానికి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన హమీ రాకుండా సమ్మె విరమించడంపై సమైక్యాంధ్రవాదుల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. జీతాల్లేక విలవిల్లాడుతున్న ఉద్యోగులను దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర సమైక్యతపై ఎటువంటి ప్రభావం చూపుతుందోననే అనుమానం కలిగిస్తోంది.
 
 హామీ రాకుండా విరమణా!
 ఎటువంటి హామీ రాకుండా సమ్మె విరమించడంపై మాత్రం సగటు జనంలో అసంతృప్తి నెలకొంది. విద్యుత్తు ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టి కేంద్రం మెడలు వంచుతున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు ఒక్కొక్కటీ సమ్మె విరమించడంపై సమైక్యవాదుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ‘రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆగ్రహావేశాలతో సమ్మెలోకి దిగిన వీరు ఏ హామీ వచ్చిందని విరమిస్తున్నట్టు? అని రాజమండ్రి తాడితోటకు చెందిన కూరగాయాల వ్యాపారి రాఘవమూర్తి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం అందరు ఎమ్మెల్యేల వద్ద నుంచి తెలంగాణ  బిల్లును వ్యతిరేకిస్తామని హామీ తీసుకుని విరమించినా బాగుండేదని అంటున్నారు.
 
 ‘విద్యుత్తు ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగుల అంశం, ఆర్టీసీ ఉద్యోగులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి షరతులతో కూడిన విరమణ ప్రకటించారు. కానీ ఎన్‌జీఓలు మాత్రం ఉద్యోగులకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. జీతాలు లేకపోయినా జీవి తాలు ముఖ్యం అంటూ నేతల వెనుక నడిచిన ఉద్యోగులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎటువంటి ప్రయోజనం లభించలేదు’ అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ) వ్యాఖ్యానించారు. కార్మికులు మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. 
 
 ప్రజలు అందరినీ కలుపుకోకుండా ఉద్యోగులు ఉద్యమం చేసుకుపోయారు. ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోకుండా సమ్మెను ముగించారు. ఆర్భాటంగా ఆరంభించి అర్ధంతరంగా ముగించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయ్యే ప్రమాదం ఉందని స్టేట్‌బ్యాంకు పెన్షనర్ల సంఘం ప్రాంతీయ కార్యదర్శి కె.ఎస్.ఎన్ మూర్తి అభిప్రాయపడ్డారు. కాగా ఉద్యోగులు చేసిన త్యాగం మాత్రం చరిత్రలో నిలిచిపోయే అంశంగా జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు. 
 
 సమ్మెకే తాత్కాలిక విరమణ.. ఉద్యమానికి కాదు
 సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తాత్కాలికంగా విరమణ ఇచ్చామని సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఎస్‌వీ సుబ్బారావు చెప్పారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాత్కాలిక విరామం ఇచ్చామే తప్ప ఉద్యమానికి కాదని స్పష్టం చేశారు. రాష్ర్ట విభజనపై కేంద్రం మరింత ముందుకెళ్తే మాత్రం ఏ క్షణంలోనైనా మళ్లీ మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. సర్టిఫికెట్లు జారీ కాక విద్యార్థులు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కాక రైతులు, ఇతర ధ్రువ పత్రాలు పొందలేక సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారని, అలాగే ఆరోగ్యశ్రీ రోగులతో పాటు వివిధ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాల లబ్దిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమకు అన్నివిధాలా అండదండలు ఇచ్చిన ప్రజల సంక్షేమం కోసం సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించామని అన్నారు. గత 79 రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. విధులకు హాజరవుతూనే భోజన విరామ సమయంలో ప్రతి రోజూ నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఈ నెల 22న జేఎన్‌టీయూకే మైదానంలో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ  కొనసాగుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచీ లక్షలాదిగా సమైక్యవాదులు తరలివచ్చి దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement