తొండూరు: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ యువకుడు అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మృతి చెందాడు. పనికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ బడుగు జీవి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రమైంది. పోలీసుల కథనం మేరకు.. మల్లేల గ్రామానికి చెందిన ఓతూరు మల్లికార్జున(25) ఏడాది నుంచి అత్తగారి ఊరైన తొండూరులో నివాసముంటున్నాడు.
బుధవారం ఉదయాన్నే బూచుపల్లె గ్రామంలోని కొండ సమీపంలో ట్రాక్టర్‌లో బోలర్స్(కంకరరాళ్లు) నింపేందుకు కూలి పనులకు వెళ్లాడు. ట్రాక్టర్‌లో బోలర్స్ నింపాక ట్రాక్టర్ కొండపై నుంచి కిందకు దిగాక అందులో ఎక్కుదామని భావించి ట్రాక్టర్ ముందు నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో పక్కనే నడుచుకుంటూ వస్తున్న మల్లికార్జునపై ట్రాక్టర్ పడటంతో దాని కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
వెంటనే అతను మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు.మృతుని తల్లి దస్తగిరమ్మ, తండ్రి ఓతూరు పీరాలతోపాటు భార్య సిద్ధేశ్వరి సంఘటన స్థలానికి వెళ్లి విగతజీవిలా పడి ఉన్న మల్లికార్జున మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వివాహమైన నాలుగేళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ వారు మృతదేహంపై పడి రోదిస్తుంటే చూపరుల హృదయం ద్రవించిపోయింది. రెండేళ్ల వయసున్న మృతుని కుమారుడు తన తండ్రికి ఏం జరిగిందో.. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక అమాయకంగా చూస్తుంటూ ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కంట తడిపెట్టారు. ఈ సంఘటనపై హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. మల్లికార్జున మృతదేహానికి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల
పరామర్శ
బూచుపల్లె కొండ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మల్లికార్జున మృతి చెందిన విషయం తెలుసుకున్న బూచుపల్లె, మల్లేల గ్రామాలకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి, బూచుపల్లె సర్పంచ్ వెంకటచలమారెడ్డి, మాజీ సర్పంచ్ గంగులయ్య, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా: యువకుడి మృతి
Published Thu, Jul 2 2015 2:54 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement