టెండర్ ! | Trader | Sakshi
Sakshi News home page

టెండర్ !

Published Mon, Feb 23 2015 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

Trader

రిమ్స్ క్యాంటీన్ కాంట్రాక్టుకు ఇస్తున్నారట కదా.. మీరేం చేస్తారో.. ఎలా చేస్తారో నాకు తెలీదు.. ఆ కాంట్రాక్టు మావాడికే రావాలి.. అంతే.. అని జిల్లాకు చెందిన ఒక టీడీపీ అగ్రనేత రిమ్స్ అధికారులకు హుకుం జారీ చేశారు. దాంతో వారు తమ బుర్రలకు పదునుపెట్టారు. జీవోను అడ్డుపెట్టుకొని అడ్డగోలు వడ్డింపునకు సిద్ధమయ్యారు. పేరుకు పత్రికలో టెండరు ప్రకటన ఇచ్చినా.. జీవోలోని అంశాలను అందులో పేర్కొనకుండా టెండరు ఖరారు సమయంలో ఆ నిబంధనలనే సాకుగా చూపి రిమ్స్ క్యాంటీన్‌కు పసుపు రంగు పులిమారు.
 
 రిమ్స్ క్యాంపస్: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్స్(రిమ్స్) ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను లీజుకు ఇచ్చేందుకు సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. గార మండలం అంపోలు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దానిపై కన్నేశాడు. టీడీపీ అగ్రనేత వద్దకు వెళ్లి ఎలాగైనా క్యాంటీన్ కాంట్రాక్టు తనకు ఇప్పించాలని కోరాడు. సదరు అగ్రనేత రిమ్స్ అధికారులకు వెంటనే ఫోన్ చేసి తమ వాడికే క్యాంటీన్ కట్టబెట్టాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న ఆ నేత ఆదేశాలతో అధికారులు అడ్డదారులు వెతికి ప్రణాళిక సిద్ధం చేశారు.
 
 ఆ మేరకు గత డిసెంబరు 23న ఒక పత్రికలో టెండర్ నోటీసు ఇచ్చారు. ఏదైనా ప్రభుత్వ సంస్థ పరిధిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆ ప్రకటన మేరకు చాలా మంది టెండర్లు దాఖలు చేశారు. కాగా టీడీపీ అగ్రనేత ప్రాపకం పొందిన ఆ పార్టీ ఛోటా నేత తెలివిగా తనకు తెలిసిన ఓ వికలాంగుడి చేత టెండర్ వేయించారు. జనవరి 5వ తేదీన టెండర్లు తెరిచారు. రూ. 2 లక్షల అడ్వాన్స్‌తోపాటు రూ.16వేలకుపైగా నెలవారీ అద్దె చెల్లిస్తామంటూ పలువురు కొటేషన్లు దాఖలు చేశారు.
 
 అయితే వారెవరినీ కాదని వికలాంగ కోటా అని చెబుతూ టీడీపీ నేత తరఫున టెండరు వేసిన వికలాంగుడికే లీజు ఖరారు చేసేశారు. ఇంతకూ ఆయన ఆఫర్ చేసిన నెల అద్దె రూ. 6 వేలే. దీంతో మిగిలిన టెండర్‌దారులు అభ్యంతరం చెప్పారు. వికలాంగ రిజర్వేషన్ ఉంటుందని ముందు చెప్పకుండా టెండర్లు తెరిచేటప్పుడు చెప్పడమేమిటని మిగిలిన దరఖాస్తుదారులు నిలదీశారు. మరోవైపు తమకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలంటూ టెండర్లు వెసిన మహిళా సంఘాల ప్రతినిధులు కూడా వివాదం రేపారు. దాంతో అప్పటికి టెండరు ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల ఆ టీడీపీ నేత అనుచరుడికే క్యాంటీన్‌ను కట్టబెట్టారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా సిద్ధం చేశారు. అధికారుల భరోసాతో సదరు వ్యక్తి సోమవారం క్యాంటీన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.
 జీవోతో మాయాజాలం
 టీడీపీ ఆగ్రనేత ఆదేశాలకు తలొగ్గిన రిమ్స్ అధికారులు జీవో పేరుతో మాయ చేశారు. పత్రికలో ప్రచురించిన టెండర్ నోటీసులోగానీ,  టెండరు దరఖాస్తులో గానీ వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొనలేదు. ఆ విషయం ముందే ప్రకటించి ఉంటే  జిల్లాలో ఉన్న ఎంతో మంది వికలాంగులు ప్రయత్నించేవారు. అదే జరిగితే ఆగ్రనేత చెప్పిన వ్యక్తికి కాంట్రాక్టు దక్కదన్న ఉద్దేశంతోనే  రిజర్వేషన్ విషయాన్ని బయటపెట్టని అధికారులు.. తమను నిలదీస్తున్న వారికి జీవో నెంబరు 874ను చూపుతున్నారు. ఆ జీవో ప్రకారమే టెండరు ఖరారు చేశామంటున్నారు. గతంలోనూ ఈ క్యాంటీన్‌ను అడ్డదారిలో కేటాయించేందుకు జరిగిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు ఇప్పుడు మరో అడ్డదారి తొక్కారు.
 
 ఆ జీవో ఏం చెబుతోందంటే..
 టీస్టాల్స్, క్యాంటీన్స్, సైకిల్ స్టాండ్స్, రిటైల్ మెడికల్ షాపులు, టెలిఫోన్ బూత్‌లు, స్కూటర్, కార్ స్టాండ్లు మొదలైన వాటిని లీజుకు ఇచ్చేటప్పుడు జీవో ఎం.ఎస్. నెంబరు 604 ప్రకారం వికలాంగులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల ప్రాతినిధ్యంలోని సంస్థలకు, వెల్ఫేర్ కార్పొరేషన్లకు, జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నవారికి ప్రాధాన్యత కల్పించాలని జీవో నెంబరు 874 చెబుతుంది.
 
 అయితే వీటిని టెండరు నోటీసులో పొందుపరచలేదు. టెండర్లు దాఖలు చేసిన వారిలో మహిళా సంఘల వారు ూడా ఉన్నా.. వారిని పరిగణనలోకి తీసుకోలేదు. క్యాంటీన్ లీజు విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మళ్లీ టెండర్లు పిలవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement