
సాక్షి, అమరావతి: పారదర్శక పరిపాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లుగా అడ్డగోలుగా నిధులు విడుదల చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిచంద్రను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెటింగ్, సహకార శాఖల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న వై.మధుసూధన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
విశాఖ, విజయవాడ కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో అడ్డగోలుగా కన్సల్టెంట్లను నియమించి, నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్య చౌదరిని బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. యువజన సేవల విభాగం కమిషనర్‌గా ఉన్న భానుకుమార్‌ను ఏపీఎండీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్న కాంతిలాల్ దండేకు ఇంటర్మీడియట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు అధికారులను బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్‌లో ఉన్న కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరు అధికారులను బదిలీ చేసి పోస్టింగ్‌ల కోసం జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. కీలకమైన విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు. ఇప్పటివరకూ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న సృజనను అక్కడే మహా విశాఖ కమిషనర్‌గా, చిత్తూరు జిల్లా జేసీ గిరీషను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
విద్యుత్ శాఖలో భారీ ప్రక్షాళన
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యుత్ శాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీని మార్చేసింది. తాజాగా ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(కమర్షియల్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌డీ, ఐటీ) కేవీఎన్ చక్రధరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ స్థానం కొంతకాలంగా ఖాళీగానే ఉంది. అంతకు ముందు ఆదాయపు పన్ను శాఖ నుంచి డిçప్యుటేషన్‌పై వచ్చిన దినేష్ పరుచూరి పదవీ కాలం ముగిసింది. పొడిగింపు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన బాధ్యతలను విజిలెన్స్ జేఎండీగా ఉన్న ఉమాపతికి అప్పగించి రిలీవ్ అయ్యారు. అప్పటి నుంచి ఉమాపతి రెండు పోస్టుల్లోనూ కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమాపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కోరిందే తడవుగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. తొలుగా జేఎండీని నియమించింది. విజిలెన్స్ జేఎండీ పోస్టును ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఎండీగా నాగలక్ష్మిని నియమించారు. విద్యుత్ సంస్థల్లో రెండు డిస్కమ్‌లున్నాయి. వీటిలో ఒకదానికి ఐఏఎస్ అధికారిని, మరో డిస్కమ్‌కు టెక్నికల్ వ్యక్తిని నియమిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న ఎంఎం నాయక్‌ను ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. దీంతో ఈ డిస్కమ్ సీఎండీ పోస్టు ఖాళీగానే ఉంది. ఈపీడీసీఎల్ సీఎండీగా ఎన్నికల ముందు విజయవాడ సీఈగా ఉన్న రాజబాపయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాన్ని కొత్త ప్రభుత్వం పున:సమీక్షిస్తోంది.
ఈ కారణంగా ఈ డిస్కమ్‌కు ఐఏఎస్ అధికారి నాగలక్ష్మిని నియమించారు. సంప్రదాయ పునరుత్పాద అభివృద్ధి సంస్థకు(నెడ్‌క్యాప్) కొత్తగా రమణారెడ్డిని నియమించారు. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నెడ్‌క్యాప్ పాత్ర కీలకం. ఈ ఒప్పందాలపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ కారణంగా పూర్తిస్థాయి అధికారి అవసరమని భావించి నియామకం చేపట్టినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు టెక్నికల్ అధికారిని సీఎండీగా నియమిస్తే విద్యుత్ శాఖలో ప్రధాన ప్రక్షాళన పూర్తయినట్టే.
Comments
Please login to add a commentAdd a comment