
మాట వినకుంటే వేటే
► మూడేళ్లలో ఐదుగురు కమిషనర్ల బదిలీ
► మాట వినడం లేదనే నెపంతోనే
► అభివృద్ధిలో గుంటూరు వెనుకంజ
సాక్షి, గుంటూరు : మాట వినకుంటే బదిలీ వేటు.. రాజధాని నగరంలో టీడీపీ నేతల అరాచకాలు.. అనధికార కట్టడాల జోలికి వచ్చినా.. అభివృద్ధి పనుల్లో నాసిరకం పనులు చేసినా పట్టించుకోకూడదు.. అలా కాదని అడ్డుపడితే గ్రూప్–1 అధికారి అయినా, ఐఏఎస్ అధికారి అయినా.. ఐదు నెలలు, మహా అయితే ఏడాది మాత్రమే కమిషనర్‌గా కొనసాగుతారు.. ఇది గుంటూరు నగరపాలక సంస్థ పరిస్థితి. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఐదుగురు కమిషనర్లు బదిలీ కావడం గమనార్హం.
రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్‌లో జరగని విధంగా రాజధాని నగరమైన గుంటూరులో అధికార పార్టీ నేతల జోక్యం తీవ్రస్థాయిలో ఉండటంతో కింది స్థాయి అధికారుల నుంచి కమిషనర్ వరకు ఎవరినైనా ఇట్టే బదిలీ చేసేస్తున్నారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగంతో పాటు అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన అధికారులు మూడేళ్లలో నలుగురైదుగురు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన అధికారులు నగరంపై పట్టు సాధించేలోపే బదిలీ చేస్తున్నారు.
సొంత పార్టీ నుంచే విమర్శలు...
రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ఆ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదనేది అందరూ అంగీకరించాల్సిన బాధాకరమైన విషయం. విజయవాడకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం జరగడం లేదు. తాజాగా బుధవారం జరిగిన ఐఏఎస్ బదిలీల్లో జీఎంసీ కమిషనర్ నాగలక్ష్మిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నగరంపై పట్టు సాధిస్తున్న నాగలక్ష్మిని బదిలీ చేయడంతో టీడీపీ ప్రజాప్రతినిధులపై సొంత పార్టీ నాయకులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే...
గుంటూరు నగరంలో మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయి. వేసవి కాలం వచ్చిందంటే నగర ప్రజలు తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో నాలుగేళ్ళ కిందట ప్రారంభించిన సమగ్ర మంచినీటి పథకం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
దీనికి తోడు గత రెండేళ్ళుగా ఇంజినీరింగ్ అధికారులు లీకులు ఇచ్చే పైపులైను మరమ్మతులు సైతం చేపట్టకపోవడంతో 10 నుంచి 15 ఎంఎల్డీ నీరు వృథాగా పోతోంది. నగరం అనధికార నిర్మాణాలకు అడ్డాగా మారింది. పట్టణ ప్రణాళికా విభాగంలో కొందరు అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ టీడీఆర్ బాండ్‌ల వ్యవహారంలోనూ, లేబర్ సెస్ వసూళ్ళలోనూ భారీ మొత్తంలో మామూళ్ళు పుచ్చుకున్న వ్యవహారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడిన విషయం తెలిసిందే.
మూడేళ్లలో ఐదుగురు కమిషనర్లు..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో పి.నాగవేణి 2014 మార్చి 14న కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టగా ఆమెను అదే ఏడాది డిసెంబరు 13న అంటే తొమ్మిది నెలలకే బదిలీ చేశారు. అనంతరం అప్పటి జేసీ శ్రీధర్‌కు ఫుల్ అడిషనల్ చార్జి ఇచ్చి కమిషనర్‌గా 2014 డిసెంబరు 13న ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన్ను సైతం 2015 జనవరి 22న బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన కన్నబాబు ఆరు నెలలు పూర్తి కాకముందే డీఎంఏగా బదిలీపై వెళ్ళారు.
2015 జూలై 8న అప్పటి గుంటూరు ఆర్డీ అనురాధ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమెను సైతం ఐదు నెలలు కాకముందే బదిలీ చేశారు. అనంతరం 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి ఎస్.నాగలక్ష్మి 2015 డిసెంబరు 7వ తేదీన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాజధాని నగరం కావడంతో ఐఏఎస్‌ను కొనసాగిస్తారని అందరూ భావించారు. అయితే ఆమెను సైతం ఏడాదిన్నర కూడా పూర్తి కాకముందే బదిలీ చేయడం గమనార్హం.