బదిలి రాజకీయం | Transfer political | Sakshi
Sakshi News home page

బదిలి రాజకీయం

Published Mon, May 26 2014 3:35 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

బదిలి రాజకీయం - Sakshi

బదిలి రాజకీయం

- కీలక పోస్టుల స్థాన చలనానికి రంగం సిద్ధం
- అధికార పార్టీ నేతలను కలుస్తున్న అధికారగణం
- నచ్చిన వారిని తెచ్చుకునేందుకు నేతల సిఫార్సులు

 
 
 సాక్షి, ఒంగోలు, ‘నిన్నటిదాకా.. ఎలాగోలా స్వతంత్రంగా పనిచేసుకుంటూ నెట్టుకొచ్చాం.. ఇప్పుడు అధికారపార్టీ నేతల ఆదేశాలతో నడవాలి. ఇక్కడే ఉంచుతారా..? లేదంటే, దూరప్రాంతాలకు పంపుతారా..?’ అనే భయాందోళన ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ‘సార్.. నేను మీ మనిషిని, మన రూలింగ్‌లో కూడా మనకు అన్యాయం జరిగితే ఎలాగండీ..? నన్ను అక్కడకు తెచ్చుకోండి.. మీకన్నీ నేను చూసుకుంటాను..’ అంటూ ఉద్యోగుల్లో కొందరు కాకారాయుళ్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే వారిని ప్రసన్నం చేసుకునేందుకు..  వారిముందు నానారకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.

జిల్లా పాలనలో కీలకంగా పనిచేస్తున్న అధికారుల స్థాన చలనానికి చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లా స్థాయి అధికారుల్లో భారీ మార్పులుంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని, తిష్టవేసిన వారిని పంపించేందుకు రంగం సిద్ధమైందని తెలిసింది.
- మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో ఇక్కడ పనిచేసేవారిని సాగనంపి.. తమకు నచ్చిన, మాటవినే అధికారులను తెచ్చుకోవాలని తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
- టీడీపీ అధికారంలో ఇటువంటి బదిలీల సిఫార్సులు తరచూ రివాజేనని.. ఉద్యోగవర్గాలే చెబుతుండటం గమనార్హం. కొందరు అధికారులైతే ఇక్కడ్నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా..అని మానసికంగా సిద్ధపడుతున్నట్లు సమాచారం. సమర్థత కొలమానం కాకుండా.. నేతల సిఫార్సు ఎవరికుంటుందో.. అటువంటి ఉద్యోగులకు కొంతకాలం అందలాలు దక్కుతాయంటూ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
- అదేవిధంగా కొంతకాలంగా టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన అధికారులకు కత్తెర వేయాలని పలువురు నేతలు యోచిస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్, పంచాయతీరాజ్ వంటి కీలకశాఖల్లో టీడీపీ నేతలు తమకు అనుకూలంగా పనిచేసే వారిని తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
- జూన్ మొదటి వారం వరకు బదిలీల ప్రక్రియ ఉండకపోవ చ్చు. కొత్తప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాల్లో కీలకపోస్టుల్లో సమూలంగా మార్పులుంటాయని భావిస్తున్నారు.
 - ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులకు సైతం బదిలీలు తప్పవని ..నేతల అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈస్థాయి అధికారులు ఇక్కడ్నుంచి వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధపడినట్లు సమాచారం. మొత్తం మీద కొత్తప్రభుత్వం ఏర్పాటుతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా నుంచి బదిలీ ఖావడం ఖాయమని ఉద్యోగవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి.

 జిల్లా పరిస్థితిది..
- ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఎటూ తెలంగాణకు చెందిన అధికారి కావడంతో.. మరికొద్ది రోజుల్లో ఆయన బదిలీ ఖరారు కావచ్చు.
- జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి కీలక ఉన్నతాధికారిని తక్షణమే ఇక్కడ్నుంచి బదిలీ చేయించేందుకు అధికార పార్టీ నేతల్లో ఒకవర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సదరు అధికారి కూడా ఇప్పటికే కొత్తప్రభుత్వంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఒకరితో మాట్లాడి.. కొద్దిరోజులు తనను ఇక్కడ్నే కొనసాగించేలా చూడాలని కోరినట్లు తెలిసింది.
- పశ్చిమ ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు తమ పార్టీ తరఫున పనిచేయలేదని.. టీడీపీ కార్యకర్తలపై లాఠీలు ప్రయోగించారంటూ.. వారిని ఇక్కడ్నుంచి బదిలీ చేయాలని అధికార పార్టీకి చెందిన ఒక వర్గం పావులు కదుపుతోంది.
- కాంగ్రెస్ పాలనలో ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు అధికారులు పలు ప్రభుత్వ విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. వీరిని ఆ స్థానాల్లో తప్పించి.. తమను ఆశ్రయించిన, నచ్చిన వారిని తెచ్చుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు.
- ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు సహకరించిన మహిళా అధికారిపై ఇప్పటికే టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పరిపాలన అమల్లోకి రాగానే జిల్లా నుంచి ఆమెను సాగనంపాలని భీష్మించుకుని కూర్చొన్నట్లు సమాచారం. అయితే, ఆమెకు మాత్రం జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఆశీస్సులు అందజేస్తుండటంతో బదిలీ ఉంటుందా..? లేదా..? అనేది సందేహమేనని చెప్పాలి.
- ప్రభుత్వ వైద్యశాల (రిమ్స్) పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్న అధికారిని కూడా మార్పుచేసి.. తమపార్టీకి అనుకూలమైన వారిని తెచ్చుకోవాలని ఒక సామాజికవర్గం ఇప్పటికే జిల్లా టీడీపీ నాయకుల దృష్టికి తెచ్చింది.
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో మరో నాలుగైదు రోజుల్లో ఖాళీ కానున్న కీలక పోస్టుకు జిల్లాలో చాలామంది వైద్యాధికారులు పోటీపడుతున్నారు. ఆ పోస్టు ను తమకే అప్పగించాలంటూ ఎవరికి వారు తమకనుకూలమైన అధికార పార్టీ నేతల వద్దకెళ్లి బేరాలు మాట్లాడుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement