- జలాశయాల్లో తగ్గుతున్న మట్టాలు
- ఖరీఫ్ రైతుకు తప్పని ఇబ్బందులు!
నీటిఎద్దడి ముంచుకొస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండ డం, మరోవైపు జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా తక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈసారి జిల్లాలో ఖరీఫ్ రైతుకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో కూడా నీళ్లు అడుగంటడంతో వర్షాలు పడి జలాశయాలు నిండితేగానీ నీరు దిగువకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు.
సాక్షి, విజయవాడ : డెల్టాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌కు 160 నుంచి 180 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వ 144.74 టీఎంసీలే ఉండటం గమనార్హం. 590 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 517.5 అడుగుల మట్టం ఉంది. నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజి 496 అడుగులు అయినా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 510 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలంటూ జీవో జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి.
510 అడుగుల వరకు నీరు ఇవ్వడానికి 14 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. శ్రీశైలంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 815.9 అడుగులు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం డ్యామ్‌ల నుంచి సాగునీటి కోసం నీరు విడుదల చేసే అవకాశం లేదు. నాగార్జునసాగర్‌లోనే సాగునీటి అవసరాల కోసం 14 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
‘నైరుతీ’.. సకాలంలో వస్తేనే..
నైరుతీ రుతుపవనాలు సకాలంలో వచ్చి కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు బాగా పడి ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండితేగానీ కిందికి నీరు వచ్చే అవకాశం కనపడడం లేదు. 2004 తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖరీఫ్‌కు జూన్ రెండు, మూడు వారాల్లో నీటిని విడుదల చేసేవారు. అంతకు వారం ముందు తాగునీటికి, వరి నారుమళ్ల కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలేవారు. డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే రాష్ట్రం విడిపోయిన తరుణంలో కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి. దీని ఏర్పాటుకు మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్రస్థాయి కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను సభ్యులుగా వేశారు. ఈ కమిటీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీరు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. జూన్ రెండో వారంలో నారుమళ్ల కోసం కూడా నీరు విడుదల చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇంకా సమయం ఉండడంతో ఈలోపు వరుణుడు కరుణిస్తే ఈ ప్రాంతానికి తాగు, సాగునీటి ఎద్దడి తప్పుతుందని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.