సాక్షి ప్రతినిధి, కడప: బదిలీపై వెళ్తున్న ఓ ఎస్‌ఈ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ నియామకాలకు తెరలేపారు. ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో బ్రేకులు పడ్డాయి. మరోమారు అనర్హులకు అవకాశం కల్పించేందుకు సిబ్బంది రెడీ అయ్యారు. ఉద్యోగాల కోసం ఎంతకాలంగానో ఓ వైపు అర్హులు ఎదురుచూస్తుంటే మరోవైపు అనర్హుల కోసం చేతివాటం ప్రదర్శించారు. ఇదివరకే లబ్ధిపొందిన వారి కుటుంబాలకు చెందిన మరో ముగ్గురికి అవకాశం కల్పించేం దుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
తెలుగుగంగ ముంపు బాధితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. పదేళ్ల కాలంగా ఇప్పటికే సుమారు 250 మందికి వివిధ ఉద్యోగాలు దక్కాయి. మరో ఐదువేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారంత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దళారుల చేతి వాటం కారణంగా అనర్హులకు అవకాశం దక్కుతోంది. తెలుగుగంగ ఎస్‌ఈ కార్యాలయం అందుకు వేదికైంది. ఇటీవల టెక్నికల్ అసిస్టెంట్లను నియమించేం దుకు రంగం సిద్ధమైంది. అప్పట్లో రెండు కుటుంబాలకు మరోమారు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఆ విషయాన్ని సాక్షి బహిర్గతం చేయడంతో అప్పట్లో అవకాశం లేకపోయింది. తిరిగి మరోమారు అనర్హులను అందలం ఎక్కించేందుకు యంత్రాంగం చేతి వాటం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మరో 30 మంది టెక్నికల్ అసిస్టెంట్లను నియమించనున్నారు. దాంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం.
చక్రం తిప్పుతున్న
కార్యాలయ వర్గాలు..
ప్రభుత్వ నిబంధనల మేరకు ముంపువాసులకు సీనియారిటీ, అర్హత ప్రకారం ఉద్యోగాలు కేటాయించాలి. ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అవకాశంగా మలుచుకొని యంత్రాంగం డబ్బులు దండుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జీఓ నెంబర్ 98 ప్రకారం మునకలో అవార్డు పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే ఒకే అవార్డుపైన ఒకరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి.
కానీ ఇదివరకే ఉద్యోగం కేటాయించిన కుటుంబాలకు చెందిన ముగ్గురికి తిరిగి తెలుగుగంగ యంత్రాంగం ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని అనర్హులైనా, అర్హుల జాబితాలోకి చేరుస్తున్నట్లు సమాచారం. చాపాడు మండలం చీపాడులో ఒకరు, మైదుకూరు మండలం జీవీసత్రంలో మరొకరు, బి.మఠం మండలం జడ్.కొత్తపల్లెలో స్థిరపడిన ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఆ మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఇది వరకే ఉద్యోగాలు దక్కాయి.
నకిలీ సర్టిఫికెట్లతో సైతం..
టెక్నికల్ అసిస్టెంట్ల ఎంపికకు ఐటీఐ సివిల్ లేదా పాలిటెక్నిక్ సివిల్ కనీస అర్హత. అయితే సివిల్ చేయకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో ఇదివరకే కొంతమంది ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. మరోమారు అలాంటి పరిస్థితి పునరావృతం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆయా యూనివర్సిటీలకు పరిశీలనకు పంపకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కాగాఈ విషయాల గురించి తెలుగుగంగ ఎస్‌ఈ కోటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
అర్హులను ముంచారు
Published Mon, Feb 23 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement