సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపునకు బ్రేక్
సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపునకు బ్రేక్
Published Wed, May 17 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
–రైతులు ,ఉద్యోగుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ
–జీవోపై సమీక్ష అనంతరం నిర్ణయం
ధవళేశ్వరం: సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురానికి తరలించే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖా మంత్రి నుంచి మౌఖిక అదేశాలు అందినట్లు సమాచారం. కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ వందేళ్ళ పైబడి చరిత్ర కలిగిన సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. సోమ, మంగళవారాలు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలను బంద్ చేయించి కార్యాలయ తరలింపుతో వచ్చే నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు పీఏవో, సీఈఎస్‌ఈ కార్యాలయాలకు తరచూ ధవళేశ్వరం రావాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వందేళ్ళ పైబడి ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాలను ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఏకపక్షంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగుల పక్షాన నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. తరలింపు ప్రక్రియ నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
–ఇరిగేషన్ మంత్రిని కలిసిన ఎన్జీవో నాయకులు
సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధ్వర్యంలో ఎన్జీవో నాయకులు ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిశారు. కార్యాలయ తరలింపు వల్ల కలిగే నష్టాలను మంత్రికి వివరించారు. 1988 జీవోపై పూర్తిగా సమీక్షించిన అనంతరం కార్యాలయాన్ని మార్పుపై నిర్ణయం తీసుకుందామని అప్పటివరకు సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు ప్రతిపాదనను నిలిపివేయాలని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో త్వరలో అప్పటి జీవోలో పేర్కొన్న వాటిపై సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అదేశించినట్లు తెలుస్తోంది.
Advertisement