ధవళేశ్వరం టు అమలాపురం..
ధవళేశ్వరం టు అమలాపురం..
Published Thu, May 11 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయం మార్పు
ఉద్యోగులకు మాట మాత్రంగానైనా చెప్పని వైనం
జిల్లాకు చెందిన ఓ మంత్రే కారణం?
ఆందోళనకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ ఉద్యోగులు
అడిగే వాడికి చెప్పే అవసరం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరించే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందనడానికి ఇదో ఉదాహరణ. ఉమ్మడి రాజధానిపై పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతిలో తాత్కాలికంగా నిర్మించిన కొత్త రాజధానికి ఉద్యోగులను బలవంతంగా తీసుకువచ్చారు. హడావుడి తరలింపుపై ఎంతమంది వారించినా ప్రభుత్వం ససేమిరా అంది. ఇది అసరాగా తీసుకుని...ఇప్పుడు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అమలాపురానికి ఉన్నఫళంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యాలయ ఉద్యోగులకు ఈ మార్పు విషయాన్ని మాట మాత్రంగా చెప్పకపోవడం.. ప్రభుత్వ మొండి వైఖరి నిదర్శనం. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమ బాట పడతానంటున్నారు. ఇదీ ఆ కథా కమామిషు..
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాకు చెందిన ఓ మంత్రి మెప్పు కోసం వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చేశారు. కార్యాలయ సిబ్బందికి కూడా చెప్పకుండానే గురువారం కార్యాలయ ప్రారంభ తంతును ముగించారు. మంత్రి మెప్పు కోసమే ఇరిగేషన్ ఉన్నతాధికారి కాటన్ దొర ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఇరిగేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం మార్పుపై మైనర్ ఇరిగేషన్ రైతాంగంలోనూ ఆందోళన నెలకొంది. సెంట్రల్ డెల్టాతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగం కూడా సెంట్రల్ డివిజన్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి.
మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందే
ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ధవళేశ్వరం వచ్చేవారు. ఈ కార్యాలయాన్ని అమలాపురం మారిస్తే వంద కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సెంట్రల్ డివిజన్ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ,తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్, వెంకటనగరం పంపింగ్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్,పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి.
కాటన్ దొర ఆశయానికి తూట్లు
ఉభయగోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కాటన్ దొర ఆశయానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. వందేళ్ళ క్రితం ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, హెడ్‌వర్క్స్ డివిజన్‌లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి సంబంధించి అమలాపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరంలోని సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల మార్పుకు 1988లో అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితో న్యాయపోరాటంతో అప్పట్లో అందుకు బ్రేక్ పడింది.
మంత్రి మెప్పు కోసమే!
జిల్లాకు చెందిన మంత్రి మెప్పు కోసమే హడావుడిగా ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారి భారీ స్కెచ్‌తో అమలాపురానికి కార్యాలయాన్ని మారుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు కార్యాలయ మార్పుపై ఎటువంటి సమాచారం తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. డివిజన్ కార్యాలయానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించేది ఒక్క ఈఈ మాత్రమేనని, అమలాపురం, పి.గన్నవరంలో సబ్‌డివిజన్ కార్యాలయ అధికారులే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్యాలయాన్నే అక్కడికు మార్చడంలో మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
-ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
కనీసం ముందుగా తెలియజేయకుండా హడావుడిగా సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి గురువారం ప్రారంభోత్సవం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇరిగేషన్ ఉన్నతాధికారి వైఖరిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విషయాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు.
సొంతం వద్దు.. అద్దె ముద్దు..
ధవళేశ్వరంలో సొంత భవనంలో ఉన్న సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చేందుకు అధికారులు మక్కువ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం అక్కడ పూర్తి స్థాయి సొంత భవనం కూడా లేకపోయినప్పటికీ హడావుడిగా వారం రోజుల్లో కార్యాలయం అమలాపురానికి వెళ్లిపోవాలని సూచిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆందోళన చేపడతాం..
మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బంది చేకూర్చే విధంగా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. అమలాపురంలో సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ కార్యాలయాన్ని తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సెంట్రల్ డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి అందుబాటులో ఉండే ధవళేశ్వరంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులనే అమలు చేశా..
సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు వ్యవహరంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ రాంబాబు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదేనని ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు.
Advertisement
Advertisement