సాక్షి, సంగారెడ్డి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న క్షేత్రస్థాయి కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ బదిలీల్లో ఉద్యోగుల పనితీరు, నైపుణ్యం, సాధించిన ఫలితాలకు పెద్దపీట వేయనున్నారు. జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పరిధిలో 44 మంది అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారులు(ఏపీఓ), 43 మంది ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు(ఈసీ), 198 మంది టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏ), 74 మంది కంప్యూటర్ ఆపరేటర్లు(సీఓ) నిర్ణీతకాల ఉద్యోగులు(ఎఫ్‌టీఈ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల నిర్వహణకు వీరే బాధ్యులు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉండటం, సొంత మండలాల్లో పనిచేస్తుండడం ద్వారా స్థానికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ బదిలీలను చేపట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే 11 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 4 నుంచి 11 వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీల్లో తొలి ప్రాధాన్యత మహిళలు, ఆ తర్వాత వికలాంగులకు, ఇతరులకు ఇస్తారు. అయితే, నైపుణ్యం, ఇతర అంశాలపై సాదించిన పాయింట్ల స్కోరే కీలకం కానుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డ్వామా పీడీ కన్వీనర్‌గా, డీఆర్డీఏ పీడీ, కలెక్టర్ నామినేట్ చేసిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే కమిటీ ఈ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎవరెవరికి బదిలీలు ?
సొంత మండలాల్లో విధులు నిర్వహిస్తున్నా, ఒకే మండలంలో మూడేళ్లకు పై బడి కొనసాగుతున్నా, ఉపాధికి ప్రాధాన్యత ఉన్న మండలాల్లో పనిచేస్తూ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినా, ప్రాధాన్యత మండలాల్లో పనిచేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన ఫలితాలు సాదించకపోయినా..తప్పనిసరి బదిలీకి గురి కావాల్సిందే. ఏపీఓ, ఈసీలకు మాత్రమే సొంత మండలం నుంచి బదిలీ చేయనున్నారు. ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు సొంత విజ్ఞప్తిపై బదిలీని కోరడానికి అర్హులు. ఏడాది సర్వీసు పూర్తిచేసుకుంటే స్పౌజ్(జీవిత సహచరి) కేటగిరీ కింద బదిలీకి దరకాస్తు చేసుకోవచ్చు.
పనితీరే ప్రామాణికం
బదిలీల జాబితాలో ఉన్న ఉద్యోగులకు 9 రకాల పాయింట్లు కేటాయిస్తారు. ఎక్కువ పాయింట్లు సాధించిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించనుంది. కూలీలకు పనికల్పన, కుటుంబాలకు 100 రోజుల పనికల్పన విషయంలో ప్రతిభ ఆధారంగా 4, 3, 2,1 పాయింట్లను కేటాయిస్తారు. శ్రమశక్తి సంఘాల డిమాండుకు అనుగుణంగా పనికల్పనలో చూపిన నైపుణ్యానికీ స్కోర్లు వేస్తారు. 100 శాతం పనికల్పిస్తే 4 పాయింట్లు, 80 శాతానికి 3 పాయింట్లు, 75 శాతానికి 2 పాయింట్లు, 70 శాతానికి 1 పాయింట్‌ను పొందుతారు. సకాంలో ఈ-మస్టర్లను డిటైల్డ్‌గా పంపిస్తే 4 పాయింట్లు వస్తాయి. లేకుంటే ఎలాంటి పాయింట్‌లు ఉండవు.
డ్వామాలో భారీగా బదిలీలు
Published Mon, Oct 28 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement