కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రకటన.. వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఈ విషయంపై దృష్టి సారించలేకపోయింది. ప్రస్తుతం ఇవన్నీ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం తహశీల్దార్ల బదిలీలకు సన్నద్ధమవుతోంది.
రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే తహశీల్దార్ల బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఫార్మెట్‌లో వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్ల వివరాలను సీసీఎల్‌ఏకు పంపారు. సొంత జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు ఎక్కడెక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు.. సమీప కాలంలో పదవీ విరమణ పొందనున్న తహశీల్దార్ల వివరాలను కలెక్టర్ సీసీఎల్‌ఏకు నివేదించారు. దీంతో బదిలీ ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సొంత జిల్లాలో పనిచేసే తహశీల్దార్లు విధిగా బదిలీ కావాల్సి ఉంది.
ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు, మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు, ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట మూడేళ్లు పూర్తి కానున్న వారికి బదిలీ తప్పనిసరి కానుంది. త్వరలో పదవీ విరమణ పొందనున్న వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించనున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లా నుంచి కనీసం 40 మంది తహశీల్దార్లు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన తహశీల్దార్లు కర్నూలు జిల్లాకు రానున్నారు.
రెవెన్యూ శాఖలో ఇక బదిలీల వంతు
Published Tue, Feb 4 2014 2:53 AM | Last Updated on Tue, Aug 14 2018 5:45 PM
Advertisement
Advertisement