అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :
అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బుధవారం ఉదయం 8గంటల సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ పేలే సమయానికి అటుగా వెళుతున్న భార్యాభర్తలు కూతాడి ముకుంద్, పెద్దింట్లమ్మ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇంటినుంచి అల్పాహారం నిమిత్తం హోటల్‌కు వెళుతున్నపుడు వీరీ ప్రమాదం బారిన పడ్డారు. పేలిన ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలతో కూడిన మరుగుతున్న చమురు వీరిపై పడింది. ముకుంద్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె వీపు భాగం మంటల్లో చిక్కుకోగా హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. స్థానికంగా పనిచేస్తున్న జట్టు కూలీలు ఆమెపై ఇసుక పోసి, గోనెసంచులు కప్పి రక్షించారు. సర్పంచ్ నక్కా సంపత్‌కుమార్ వారిని 108 అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పెద్దింట్లమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వెద్యం కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాన్స్‌కో డీఈ చలపతిరావు, ఏఈ ఎం.సతీష్ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. 70 శాతం పైగా శరీరం కాలిపోగా పెద్దింట్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ వైద్యులు చెబుతున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకుని బతికే పెద్దిం ట్లమ్మ ఈ ెప్రమాదానికి గురవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.
తప్పిన పెను ప్రమాదం
ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతంలోనే స్కూల్ బస్సులను ఆపి విద్యార్థులను ఎక్కించుకుంటారని, అయితే బంద్ కారణంగా బుధవారం దుకాణాలు మూసి ఉన్నాయని, విద్యార్థులూ లేరని తెలిపారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ లీకేజీపై ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ శకలాలను పరిశీలన కోసం రాజమండ్రి విద్యుత్ కార్యాలయానికి పంపుతున్నామని పేర్కొన్నారు. కాగా బాధితులను శాఖ తరఫున ఆదుకుంటామని డీఈ చలపతిరావు హామీ ఇచ్చారు.
పేలిన ట్రాన్స్‌ఫార్మర్
Published Thu, Feb 20 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement