- భీతిల్లిన మైలారం వాసులు
- ‘సింగిల్ ఫేజ్’ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్ లోపమే కారణం
- పలువురికి గాయాలు
వర్గల్, న్యూస్‌లైన్: వర్గల్ మండలం మైలారం గ్రామం ఆది వారం విద్యుత్ షాక్‌కు గురైంది. ఇంట్లో స్విచ్ బోర్డులు, సిమెంట్ గోడలు, టీవీ స్విచ్‌లు ఇలా వేటిని తాకినా షాకిచ్చాయి. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు.
గ్రామస్థులు తెలి పిన వివరాల ప్రకారం... మజీద్ సమీప సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే ఇళ్లల్లో ఆదివారం హైఓల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో గోడలు, స్విచ్‌లు తాకినా కాలనీ వాసులు షాక్‌కు గురయ్యారు.
ఇదే పరిస్థితిలో దండు లక్ష్మి, సింగారం నాగరాజు, నరేష్‌గౌడ్, అశోక్ తదితరులు షాక్ తగిలి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రాన్స్‌కో క్యాజువల్ సిబ్బంది స్వామికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో ఆయన వెంటనే గ్రామానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఎర్తింగ్ లోపాన్ని సరిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్‌కు నీటి తడి తగ్గడంతో హైఓల్టేజీ సరఫరా జరిగిందని స్వామి తెలిపారు.