
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇరవై రోజులుగా భూ ప్రకంపనలు వస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చాలామంది గ్రామాలను వదలిపెట్టి పోతుండగా ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. చిత్తూరుకు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి 34 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉండడంతో మూడు మండలాల్లోని అటవీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
బంగారిపాళ్యం మండలంలోని వెలుతురుచేను, సీజీఎఫ్‌ఎస్ కాలనీల్లో తాజాగా ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపలి నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. శబ్దం వచ్చిన ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు.. ఈ విషయమై భూకంప పరిశోధన కేంద్రంతో సంప్రదించారు. ప్రకంపనల విషయంలో ప్రజలు భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చారు. అయినా కాళ్ళ కింద షాక్ లాగా వస్తుండటంతో రైతులు క్రమంగా పొలాల వద్దకు వెళ్లడం మానుకున్నారు. ఇక్కడ ప్రకంపనలు కొనసాగుతుండగానే యాదమర్రి మండలం మాదిరెడ్డిపల్లి పరిసరాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రత నమోదైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం అదే మండలంలో సిఆర్ కండ్రిగలో ప్రకంపనలు రావడంతోపాటు గతంలో వచ్చిన ప్రదేశాల్లో ప్రకంపనలు వస్తూనే ఉండడంతో ప్రజల్లో ఆందోళన ఏమాత్రం తగ్గడంలేదు. ఆర్డీవో తదితర అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం లేదని అంటున్నారు.