సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే రాజన్నదొర
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన విశ్వవిద్యాలయం తరలింపుపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు లేఖోద్యమాన్ని చేపట్టారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు జిల్లాకు ఎంతో అవసరం కూడా!. ఇటీవల జిల్లాకు పది వరాలు ప్రకటించిన చంద్రబాబు దీన్ని మంజూరు చేయించినట్టే చేయించి పొరుగు జిల్లాకు తరలించ డంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వేడెక్కుతున్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం తరలిపోతుండడంపై అటు ప్రజలు, ఇటు నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.
ఇటీవల పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు, నాయకులు గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. యూనివర్శిటీని ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎంకు లేఖ కూడారాశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఉండాల్సింది జిల్లా కేంద్రానికి అందుబాటులో కాదని, గిరిజనులకు అందుబాటులో ఉం డాలనీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలా విశ్వవిద్యాలయం తరలింపు పట్ల వస్తున్న విమర్శల వాన ఇప్పుడు మరింత జోరు అందుకుంది.
సీఎంకు లేఖ రాసిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన యూని వర్శిటీ కూడా ఉండడంతో ఎంతో ఆనందించామని కానీ దీన్ని ఇతర ప్రాంతానికి తరలించడం గిరిజనులను మోసం చేయడమేనన్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పిన కొద్ది రోజులకే ఇలా తరలింపు వార్తలు వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ రాకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, బంద్‌లు చేపట్టాల్సి వస్త్తుందని హెచ్చరించారు. గిరిజనులు, గిరిజనేతరులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనే పరిస్థితి నెలకొంటుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా పలు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని లేఖలో స్పష్టం చేశారు.
ఈ అంశం తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని గుర్తించాలన్నారు. పాచిపెంట మండలం పెదకంచేరులో ఉన్న మూడు వేల ఎకరాల ఉచిత స్థలం కాకుండా ఇంకెక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులంతా దీని పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి, విజయనగరం జిల్లాకు మధ్య ఉన్న స్థలం ఎంతో అనువైనదన్నారు. విశాఖ నుంచి చత్తీస్‌ఘడ్‌లో ఉన్న రాయ్‌పూర్ వెళ్లే ఎన్‌హెచ్ -26 కూడా పెదకంచేరుకు దగ్గరలోనే ఉందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్, ఎంపీ రాష్ట్రాలకు ఎంతో అనువుగా ఉంటుం దని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం చాలా దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంత గిరిజనులకు యూనివర్శిటీ ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఎన్టీ రామారావు పరిపాలన ఉన్నప్పుడు కూడా విజయనగరం మహారాజా పివిజి రాజు కూడా గిరిజన విశ్వవిద్యాలయానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాచిపెంటలోని స్థలాన్ని జూలై 4వ తేదీన సందర్శించి గిరిజనులకు కూడా తమ మాన్సాస్ సంస్థకు చెందిన భూమిని తమ తండ్రి స్మృత్యర్ధం విరాళంగా ఇవ్వనున్నామని ప్రకటించారన్నారు. వెనుకబడిన జిల్లాగా, ఈ ప్రాంత గిరిజనుల అవసరాన్ని దృష్టిలో ఉం చుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే నిర్మించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం పట్ల జిల్లాలో నానాటికీ పెరుగుతున్న నిరసనల పట్ల బాబు ఎలా స్పందిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా అటు టీడీపీ, ఇటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు తమ మద్దతును తెలియజేస్తూ గిరిజన యూనివర్సిటీ కోసం లేఖలిస్తున్నారు. మరి సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
.
యూనివర్సిటీని తరలిస్తే ఊరుకొనేది లేదు
జియ్యమ్మవలస : జిల్లా నుంచి గిరిజన యూనివర్సిటీని తరలిస్తే సహించేది లేదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. 2006 సంవత్సరం నుంచి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం ప్రయత్నిస్తున్నామని, తెలిపారు. టీడీపీ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు తొలుత హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. దీనిపై దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు జిల్లా గిరిజనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఆరిక సింహాచలం ఉన్నారు.