సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన యూనివర్సిటీ కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో సీఎం చంద్రబాబునాయుడ్ని సోమవారం కలిసి, గిరిజన వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతంగా, నాలుగైదు రాష్ట్రాలతో అనుసంధానంగా ఉన్న విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసి, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబునాయుడికి విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ పాచిపెంట మండలంలోని స్థలం సానుకూలంగా లేదని, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మరికొన్ని స్థలాలను గుర్తించి ప్రతిపాదిస్తే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. రోజురోజుకూ వెల్లువెత్తుతున్న నిరసనల దృష్ట్యా టీడీపీ ప్రజాప్రతినిధులు స్పందించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
సోమవారం విశాఖపట్నం వచ్చిన సీఎం చంద్రబాబునాయుడ్ని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో కలిశారు. కైలాసగిరి వద్ద జరిగిన వనమహోత్సవం సందర్భంగా అపాయింట్‌మెంట్ తీసుకుని గిరిజన యూనివర్సిటీ తరలింపు విషయాన్ని ప్రస్తావించారు. తమకే దక్కాలని, వచ్చిన అవకాశాన్ని దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కలిసిన వారిలో మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, మీసాల గీత, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, సాలూరు, బొబ్బిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్.పి.భంజ్‌దేవ్, శోభా హైమావతి, టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీరాజు, సాలూరు టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి తదితరులు ఉన్నారు. వీరి విజ్ఞప్తి మేరకు సీఎం స్పందిస్తూ పాచిపెంటలో కాకుండా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న స్థలాలను ప్రతిపాదిస్తే పరిశీలించి, ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పారు.
గిరిజన వర్సిటీ కోసం సీఎంను కలిసిన టీడీపీ ప్రజాప్రతినిధులు
Published Tue, Nov 18 2014 1:25 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM
Advertisement
Advertisement