
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర మాజీ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకొన్న రాఘవాచారి భౌతిక ఖాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పత్రికారంగ ప్రముఖులు, ఏపీ పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. రాఘవాచారి మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటివీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం ఆయన భౌతిక ఖాయాన్ని పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు కుటుంబసభ్యులు అప్పగించనున్నారు.