ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియం | Triple IT | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియం

Published Thu, Mar 12 2015 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

Triple IT

వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వెల్లడించారు. 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్న టెక్ ఫెస్టివల్‌పై బుధవారం డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డిలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు తమ సమస్యలు తీర్చమని కోరడం మంచిదే కానీ.. సమంజసం కానీ డిమాండ్లను తీర్చాలని పట్టుబట్టడం సరికాదన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తాము అన్నివిధాలా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
 
 ఈ కమిటీలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్బురాజన్, సీఐ మహేశ్వరరెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు ఉంటారన్నారు. నెలకొకసారి సమావేశమై ఇక్కడి సమస్యలను తమకు తెలియజేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ. 90 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, ల్యాబొరేటరీలు, ఇండోర్ స్టేడియం ఇందులో ఉన్నాయన్నారు. యూనిఫాం కోసం టెండర్లు పిలిచామన్నారు.
 
 కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అన్ని ట్రిపుల్ ఐటీల్లో వైఫై సౌకర్యం కల్పించాలనిన సీఎం చెప్పారన్నారు.   రూ.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, యోగా సెంటర్ ఉంటాయన్నారు. రూ. 60 లక్షలతో వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేశామన్నారు. తాగునీటి సౌకర్యం బాగుందన్నారు. అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.
 
 టెక్ ఫెస్టివల్‌కు
 మంత్రి ఘంటా రారు..
 ఈనెల 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో జరగనున్న టెక్ ఫెస్టివల్‌కు సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు రావడం లేదని వైస్ చాన్సలర్ సత్యనారాయణ తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందన్నారు. టెక్ ఫెస్టివల్‌కు సంబంధించి వలంటీర్లతో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ను పరిశీలించారు. అనంతరం పీ2 విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి బోధన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల గురించి ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని.. సక్రమంగా చదువుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement