ఆయనో కూచిపూడి నృత్య కళాకారుడు. అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందాడు.
కూచిపూడి కళాకారుడికి ఫోన్ ద్వారా టోకరా
నగలు పంపిస్తామని ఎరవేసిన గ్యాంగ్
వివిధ పన్నుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా
కేసు పెడతామనడంతో భయపడిన వైనం
సిటీబ్యూరో: ఆయనో కూచిపూడి నృత్య కళాకారుడు. అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందాడు. ఇంటర్‌నెట్‌లో సొంతంగా ఏర్పాటు చేసుకున్న వెబ్‌సైట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. దాని ఆధారంగా సంప్రదించిన ఓ ముఠా నగలంటూ ఎరవేసి... కేసులని భయపెట్టి.. పన్నుల పేరుతో రూ.7.5 లక్షలు కాజేసింది. దీనిపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలివీ... నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సుధాకర్‌రెడ్డి కూచిపూడి నృత్య కళాకారుడు. యువతిగా అలంకరించుకుని అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన ఎన్నో బహుమతులు పొందా రు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఇంటర్‌నెట్‌లో సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరిచారు.
పొగడ్తలతో ముంచారు
సుధాకర్ రెడ్డికి దాదాపు నెల రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. తాము లండన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన అవతలి వ్యక్తులు వెబ్‌సైట్‌లో ఫొటోలు, వీడియోలు చూశామని పొగడ్తలతో ముంచెత్తారు. మీతో యూకేలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని... అలంకరించుకోవడానికి కొన్ని నగలు పంపిస్తామని ఎరవేశారు. దీంతో కాస్త కంగుతిన్న సుధాకర్ రెడ్డి... తాను పురుషుడినని, నగలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. ఈ మాట వినడంతోనే సర్దుకున్న అవతలి వ్యక్తులు... తాము కళాకారులకు పంపుతున్నామని... ఇందులో స్త్రీ, పురుష భేదం లేద ని సరిచేసుకున్నారు. యూకేలో ఈవెంట్ పేరుతో కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. యూకేలో జరిగే ఈవెంట్‌లో తాము ఇచ్చిన నగలనే ధరించి నృత్యం చేయాలంటూ నమ్మబలికారు. ఓ రోజు హఠాత్తుగా నగలతో పాటు ఆ బాక్సులో 35 వేల పౌండ్లు పెట్టి పంపిం చామంటూ సుధాకర్‌రెడ్డికి వర్తమానం పంపారు. ఇది జరిగిన మరుసటి రోజే కస్టమ్ అధికారిణి అంటూ ఓ యువతి ఫోన్ చేసింది. మీకు లండన్ నుంచి నగలతో పాటు కొన్ని పౌండ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని చెప్పింది.
పన్నుల పేరుతో దోపిడీ
ఈ రకంగా విదేశాల నుంచి అక్రమంగా రావడం కస్టమ్స్ నిబంధనలకు విరుద్ధమని... ఈ నేపథ్యంలోనే మీపై కేసు నమోదు చేయనున్నామంటూ భయపెట్టింది. అలా కాకుండా ఉండాలంటే దాదాపు రూ.కోటి విలువైన నగదు, పౌండ్లకు సంబంధించి రూ.4.5 లక్షల పన్ను కట్టాలంటూ ఓ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పింది. ఆందోళనకు లోనైన సుధాకర్‌రెడ్డి ఆ మహిళ చెప్పినట్లు నగదు డిపాజిట్ చేశారు. ఆ తరవాత మళ్లీ సంప్రదించిన యువతి ఎఫ్‌బీఐ, ఆర్బీఐ క్లియరెన్స్‌ల పేరుతో మరో రూ.3 లక్షల వరకు దఫదఫాలుగా డిపాజిట్ చేయించుకుంది. చివరకు సమాధానం లేకపోవడంతో తాను మోసపోయినని గుర్తించిన బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ ఏసీపీ ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఉత్తరాదికి చెందిన నైజీరియన్ల పనిగా అధికారులు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.