హస్తం గూటికి అరవిందరెడ్డి? | TRS MLA Aravinda Reddy to Join in Congress | Sakshi
Sakshi News home page

హస్తం గూటికి అరవిందరెడ్డి?

Published Fri, Jan 24 2014 3:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS MLA Aravinda Reddy to Join in Congress

 శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి టీఆర్‌ఎస్‌కు రాంరాం చెప్పనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వారం రోజులుగా ఆయన ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరపడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుపై శాసనసభలో సభ్యుల అభిప్రాయాలు చెబుతున్న ఈ కీలక తరుణంలో అరవిందరెడ్డి సభకు రాకుండా ఢిల్లీలో మంతనాలు సాగించడం టీఆర్‌ఎ్‌స్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అరవిందరెడ్డి ఢిల్లీలో రెండుసార్లు కేంద్ర మంత్రి, సీనియర్ నేత జైపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. సోమ, మంగళవారం జైపాల్ నివాసానికి వెళ్లి చేరికపై సుదీర్ఘంగా చర్చించారని విశ్వాసనీయ సమాచారం. అరవిందరెడ్డి తండ్రి మాజీ ఎంపీ నర్సింహారెడ్డి జైపాల్‌రెడ్డికి సమకాలికుడు కావడంతో మంచి సంబంధాలు ఉన్నాయి. జైపాల్ మధ్యవర్తిగా దిగ్విజయ్‌సింగ్‌ని రహస్యంగా కలిశారని సమాచారం.
 
 ఫాంహౌస్‌లోనే విలీనం చేద్దామని కేసీఆర్‌కు ప్రతిపాదన
 కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి కేబినెట్‌లో తీర్మాణం చేసిన తరువాత పార్టీ పరిణామాలపై కేసీఆర్ గత సెప్టెంబర్‌లో తన ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అరవిందరెడ్డి టీఆర్‌ఎస్‌ను ఇచ్చిన మాట మేరకే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సూచించారు. కానీ, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఆ రోజు నుంచే కాంగ్రెస్‌కు పోతాడని పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. దీనికితోడు టీబీజీకేఎస్‌లో గ్రూపు విభేదాలు అరవిందరెడ్డిని పార్టీకి దూరం అవడానికి కొంత కారణంగా చెప్పవచ్చు. గుర్తింపు సంఘంగా గెలిచిన తరువాత 8 మెన్ కమిటీలో చోటు కోసం వివాదం మొదలైంది. యూనియన్ అధ్యక్షుడు మల్లయ్య ఒకగ్రూపుగా, ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి వర్గం మరోగ్రూపుగా తయారవగా రాజిరెడ్డి గ్రూపుకు అరవిందరెడ్డి సహకారం ఇస్తూ వచ్చాడు. ఈ విషయం పార్టీ నాయకత్వం దృష్టికి వె ళ్లడం, పార్టీలో అరవిందరెడ్డి గిట్టని వారు మల్లయ్యకు మద్దతు తెలుపడం చివరికి చినికిచినికి ఎమ్మెల్యేల విభజనకు దారితీసింది. అరవిందరెడ్డికి వ్యతిరేక వ ర్గం ఎమ్మెల్యేలు మల్లయ్యకు మద్దతిస్తూ వచ్చారు. ఇంత చేసి ఎన్నికల్లో యూనియన్‌ను గెలిపిస్తే ఇప్పుడు గెలిచిన తరువాత పార్టీ నాయకత్వం తన కంటే మల్లయ్య మాటకే ఎక్కువ విలువ ఇస్తుందని అరవిందరెడ్డి మనస్తాపం చెందారు. అరవిందరెడ్డి పార్టీ విడుతున్నాడని ప్రచారం జరగడంతో మల్లయ్య శిబిరంలో సంబరం నెలకొంది. ఈ విషయాన్ని వారే ప్రచారం చేయడం కొసమెరుపు.
 
 నాడు ప్రజాకోర్టుతో మొదలు..
 కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన అరవిందరెడ్డి మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఇముడలేకపోతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అప్పటి సీఎం రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆక్రమంలో తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17, 2009న అరవిందరెడ్డి పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. కేసీఆర్‌సహా అందరిపై ఆరోపణలు చేశారు. చివరికి టీఆర్‌ఎస్ మంచిర్యాలలో ఆయనపై ప్రజాకోర్టు పెట్టడంతో అది ఉద్రికత్తకు దారితీయడం తెలిసిందే. చివరికి అరవిందరెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది.
 
 అనంతరం రాజశేఖరరెడ్డి చనిపోవడం తరువాత నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం పెద్దయెత్తున ఉద్యమం జరుగడంతో మళ్లీ ఉద్యమంలో కలిసిపోయి పార్టీకి దగ్గరై పార్టీలో కొనసాగారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ బాటపడుతుండంతో నాటి ప్రజాకోర్టును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, అరవిందరెడ్డి పార్టీ మారుతున్నాడని ప్రచారం జరగడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
 
 బిల్లు పెడితే కాంగ్రెస్‌లో చేరుతా..
 - ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి
 పార్టీ మారుతున్నారని ప్రచారంపై అరవిందరెడ్డిని ‘న్యూస్‌లైన్’ ఫోన్‌లో సంప్రదించగా.. ‘నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదిస్తే టీఆర్‌ఎస్ విలీనం అయిన కాకపోయిన తాను మాత్రం కృతజ్ఞతగా కాంగ్రెస్‌లో చేరుతా’’ అని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement