సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి పురిటి గడ్డ సిద్దిపేటలో ఆ పార్టీ ముఖ్య నేత హరీష్‌రావు ప్రాబల్యం తగ్గించే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోందా? ఇందుకు టీఆర్‌ఎస్ బహిష్కృత నేతలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలనుకుంటోందా?..అంటే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. సుమారు మూడు దశాబ్దాలుగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెట్టి టీఆర్‌ఎస్ నాయకత్వానికి పురిటిగడ్డలోనే కొంత ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్నప్పటికీ సిద్దిపేటలో మాత్రం కనీస బలాన్ని కూడా ప్రదర్శించలేక పోతోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సంఖ్య కనీసం రెండంకెలకు కూడా చేరలేదు.
నామినేటెడ్ పదవులు పొందిన నేతలు కూడా నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై పెద్దగా దృష్టి సారించిన దాఖలా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్ సాయంతో ఎంపీ విజయశాంతి రెండు రోజుల క్రితం నంగునూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఎంపీ విజయశాంతికి టీఆర్‌ఎస్ కేడర్ నుంచి కనీస మద్దతు కూడా దక్కలేదు. అధికార పార్టీలో ఎక్కడా అధికారికంగా చేరినట్లుగా నేటికీ ప్రకటించని విజయశాంతి, మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో మాత్రం కాంగ్రెస్ కేడర్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలు తన వద్దకు రావద్దంటూ ఎంపీ హుకుం కూడా జారీ చేశారు. 2009 సాధారణ ఎన్నికల్లో కేవలం సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చిన భారీ మెజారిటీతోనే విజయశాంతి స్వల్ప ఓట్ల తేడాతో ఎంపీగా ఎన్నికయ్యారు.
సిద్దిపేట బరిలో రఘునందన్?
ఓ వైపు విజయశాంతి టీఆర్‌ఎస్ నేతలపై విమర్శల దాడి కొనసాగిస్తుండగా, మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మరో బహిష్కృత నేతను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుపుతుందనే ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది. రఘునందన్‌ను బరిలోకి దించడం ద్వారా టీఆర్‌ఎస్, హరీష్‌కు పురిటిగడ్డపై ఇబ్బందికర వాతావరణ సృష్టించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అందువల్లే సోనియాకు కృతజ్ఞత పేరిట కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జైత్రయాత్ర’ సభ సిద్దిపేటలో నిర్వహిస్తామంటూ కొందరు నేతలు లీకులిస్తున్నారు. అయితే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ సభ జోగిపేటలో జరుగుతుందని చెబుతున్నారు. సిద్దిపేటలో సభ ఉంటుందంటూ లీకులు ఇవ్వడం వెనుక టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని రెచ్చగొట్టడమే కాంగ్రెస్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే టీఆర్‌ఎస్ జిల్లా కీలక నాయకత్వం మాత్రం కాంగ్రెస్ నేతల విమర్శలు, ప్రకటనలను తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ‘‘ఎంపీ లాడ్స్ నిధుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఎంపీ విజయశాంతి చుట్టూ తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తిని వెళ్లగక్కేందుకు కాంగ్రెస్ కేడర్‌ను ఎంపీ ఉపయోగించుకుంటోంది. ఓ వైపు విలీనం జరుగుతుందంటూ ప్రచారం చేస్తూ, మరోవైపు టీఆర్‌ఎస్‌ను లక్ష్యం చేసుకోవాలనే ఉద్దేశం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. విలీనంపై మా పార్టీ కేడర్, నాయకత్వం పూర్తి వ్యతిరేకతతో ఉంది. రోగి కోరుకుంటున్నది వైద్యుడు ఇస్తున్నది ఒకటే అనే రీతిలో కాంగ్రెస్ వైఖరి ఉంది’’ అని సదరు పార్టీ కీలక నేత జిల్లాలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించారు.
టార్గెట్ సిద్దిపేట
Published Sun, Nov 10 2013 12:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement