టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
తిరుపతి కల్చరల్: శ్రీవారి వైభవాన్ని, సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేలా తెలుగు నూతన సంవత్సరంలో విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మథనామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని, భక్తులందరిపైనా శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులందరికీ మరింత మెరుగ్గా సంతృప్తికరమైన దర్శనం, బస, అన్నప్రసాద వితరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. టీటీడీ సామాజిక బాధ్యతగా చేపడుతున్న పేదరోగులకు వైద్యసాయం, విద్యాదానం పథకాలను మరింత ఎక్కువ మందికి వర్తింపచేసి విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భక్తిభావంతో శ్రీవారిని ప్రార్థిస్తే తప్పక కరుణిస్తాడని, అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల్లో భక్తి పెంపు
మహతిలో ఉగాది వేడుకల్లో భాగంగా బాలసుబ్రమణ్యం శాస్త్రి పంచాగ శ్రవణం చేస్తూ మన్మథనామ సంవత్సరంలో ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని, తద్వారా శ్రీవారు కొలువైన తిరుమల, తిరుపతి దేవస్థానం అఖండజ్యోతిగా వెలుగొందుతుందని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాగ కర్తను ఈవో శాలువ, జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో డాక్టర్ సుముద్రాల లక్ష్మణయ్య , కలవకుంట మూర్తి, ఆచార్య మునిరత్నం, ముదివర్తి కొండమాచార్యులు, మన్నవ భాస్కర్‌నాయుడు, ఆకె ళ్ల విభీషణ శర్మ, ఉప్పలపాటి వెంకటరమణ, వీరమల్లయ్య, వెంకటస్వామి, మహర్షి సాగర్, టీటీడీ ఉద్యోగులు తోట వెంకటేశ్వర్లు, రవిచంద్రన్, హేమంత్‌కుమార్, నాగశ్రీలక్ష్మీ, కృష్ణవేణి తమ కవితలను చదివి వినించారు. టీటీడీ తిరుపతి జేఈవో పోల భాస్కర్ వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల పిల్లలు ప్రదర్శించిన ‘తెలుగు వైతాళికులు’ బాలబాలికల వేషధారణ తెలుగు వెలుగు సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, పద్యపఠనం, కవితలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ్, పీఆర్‌వో రవి, డెప్యూటీ ఈవో గౌతమి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
నూతన ఏడాదిలో విస్తృతంగా ధర్మప్రచారం
Published Sun, Mar 22 2015 2:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement