కడప: ఎన్నికల సునామీ వచ్చింది. వారం రోజుల్లో మూడు ఎన్నికలకు నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి.ఈ పరిణామం రాజకీయ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అధికారులకు ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. పరీక్షల సీజన్‌లో వచ్చిన సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ తమ పిల్లల భవిషత్తును ఎక్కడ దెబ్బతీస్తోందనే అందోళన తల్లి దండ్రుల్లో మొదలైంది.
ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలని రాజకీయ పార్టీ నేతలు, అధికారులు అందోళన చెందుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుసంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్లు 12వ తే దీకి వాయిదా పడ్డాయి. దీంతోఎన్నికలు తప్పక జరిగే అవకాశం ఉందని పరీశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.
ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సైతం ఈ నెల 18వ తేదీ నాటికి విడుదల చేసేలా షెడ్యూల్ ఖరారైంది ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ. 1250, జనరల్ అభ్యర్థులకు రూ. 2,500. జెడ్పీటీసీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500 జనరల్ అభ్యర్ధులకు రూ. 5000 డిపాజిట్‌గా నిర్ణయించారు.
వరుస ఎన్నికలతో ఉక్కిరి బిక్కిరి!
మూడేళ్లుగా ఎన్నికలు ఎప్పడెప్పడా అని ఎదురు చూసిన రాజకీయ పార్టీ నేతలకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఊహించిన విధంగా మున్సిపల్, సార్వత్రిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే సారి రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ప్రధాన రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారాయి.
సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కాలంటే మున్సిపల్,ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు కీలకం కావడంతో ప్రధానంగా అసెంబ్లీ ,లోక్‌సభ అభ్యర్థులు వాటిపై దృష్టి సారించారు.
కలవరపడుతున్న ఉద్యోగులు
ఓ ఎన్నిక నిర్వహించడమంటేనే జిల్లా యంత్రాంగం కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. మూడు ఎన్నికలు ఎలా నిర్వహించాలని ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకం కావడంతో కలెక్టరేట్‌లో ఉద్యోగులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అధికారుల నుంచి ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్ల నియామకంలో ఊపిరి సలపనంత బిజీబిజీ అయ్యారు.
ఈ మూడు నెలలపాటు ఎలాంటి వ్యక్తిగత పనులు చేసుకునే అవకాశం లేదని, విద్యార్థులకు పరీక్షాకాలం కావడంతో పిల్లల చదువులపై దృష్టి సారించే అవకాశం లేకుండా పోతోందని ‘సాక్షి’తో ఓ అధికారి పేర్కొన్నారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదని వాపోయారు. మొత్తం మీద ఈ పరిణామం ఉద్యోగులను కలవరపెడుతోంది