వెంకన్న కొలువులో మరో ఏడాది
► టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు
► సోమవారం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు ఇచ్చారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీ వరకు పదవిలో కొనసాగనుంది. టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ట్రస్టుబోర్డు సమావేశాలకు గైర్హాజరైన టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తొలగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ చట్టం, తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి చట్టం ప్రకారం ధర్మకర్తల మండలి పదవీ కాలం రెండేళ్లు. తొలి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 2014 జూన్‌లో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టింది. 11నెలలు టీటీడీకి బోర్డు లేకుండానే గడిపింది. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ధర్మకర్తల మండలిని నియమించారు. ఏప్రిల్ 28వ తేదీతో గడువు ముగిసింది. దీన్ని ముందే గుర్తించిన దేవాదాయ శాఖ పొడిగింపు ఉత్తుర్వుల ఫైలు నెల ముందే సిద్ధం చేసింది. రాజకీయ కారణాలతో అనేక ఊగిసలాటల మధ్య ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులిచ్చింది.
సమావేశాలకు గైర్హాజరైన సాయన్న తొలగింపు
టీటీడీ ట్రస్టు బోర్డులో తెలుగుదేశం పార్టీ తెలంగాణా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.సాయన్నకు అవకాశమిచ్చారు. ఆయన ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. ట్రస్టుబోర్డు పదవికి రాజీనామా చేయలేదు. పైగా గత ఏడాది డిసెంబరు నుంచి వరుసగా ఐదు సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆ మేరకు ఆయన సభ్వత్వాన్ని రద్దు చేశారు. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వారినే నియమించే అవకాశముంది.
నెల రోజుల చర్చకు సోమవారంతో ముగింపు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలం మాత్రమే టీటీడీ ధర్మకర్తల మండలి పదవిలో ఉంటుందని అంద రూ భావించారు. టీటీడీ చైర్మన్ పీఠం కోసం రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ , గోకరాజు గంగరాజుతో పాటు రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. ఇచ్చిన గడువు తర్వాత కొత్త బోర్డు వస్తుందని ప్రచారం విస్తృతంగా సాగింది. ఆలయ ధర్మకర్తల మండళ్లకూ పదవీ కాలం ఏడాది ఇచ్చినా రెండు నెలల ముందు రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంప్రదాయాన్ని టీటీడీకి వర్తింపజేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.