
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీ మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 11, 12వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. అదేవిధంగా, 12వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే, 12వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.