
తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది.
గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి)