తండ్రి మరణవార్త విని పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు
తండ్రి మరణవార్తను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి
చౌడేపల్లె: తండ్రి మరణవార్త విని పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు చౌడేపల్లె మండలానికి చెందిన ఓ విద్యార్థి. చౌడేపల్లె మండలం చారాల గ్రామానికి చెందిన బి.నరసింహారెడ్డి(49) బుధవారం మృతిచెందాడు. ఆయన కుమారుడు కార్తీక్ దుఃఖాన్ని దిగమింగుకుని బుధవారం పరీక్షకు హాజరయ్యాడు. గైర్హాజరైతే ఒక యేడాది వృధా అవుతోందని పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియలను పూర్తిచేశారు.
వడదెబ్బతో తండ్రి మృతి
కార్తీక్ తండ్రి నరసింహారెడ్డి కూలి పనులు చేసుకుని జీవించేవాడు. వారం క్రితం వడదెబ్బ తగలడంతో విరేచనాలు అయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతను కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.