‘క్రైం’ కిలాడీ
►ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు
►రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్
►రూ.13 లక్షలు వసూలు
►మరింత సొమ్ముకోసం బెదిరింపులు
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్): సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్‌చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అం టూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్పుటాపుగా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల మాటలకు బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు.
తెరవెనుక మాత్రం అతడే
కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బులు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూ లు చేశారని ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
ఫొటో మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు అడిగారు
హర్షవర్దన్ తననుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో సెక్షన్ సీని యర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో నివాసం ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్‌నెట్‌లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దరిశిపాముల విజయరత్నం బ్లాక్‌మెయిల్ చేశారు.
ఆ ఫొటోను నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు మార్ఫింగ్ చేసిన ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము ముట్టచెబితేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్‌బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు.